
హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌వీ కర్ణన్
వచ్చే నెల 2 నుంచి 17 వరకు..
సాక్షి, సిటీబ్యూరో: కేంద్ర ఎన్నికల సంఘం జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక కోసం స్పెషల్ సమ్మరీ రివిజన్ (ఎస్‌ఎస్‌ఆర్) షెడ్యూల్ విడుదల చేసిందని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ తెలిపారు. బుధవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఎస్‌ఎస్‌ఆర్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో జూలై 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు తప్పనిసరిగా ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలన్నారు. సెప్టెంబర్ 2 నుంచి 17 వరకు క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్లకు అవకాశం ఉందన్నారు. సెప్టెంబర్ 25 వరకు వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. సెప్టెంబర్ 30 వరకు ఓటరు తుది జాబితా వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించి ఈ ప్రక్రియను విజయవంతం చేయాలన్నారు.
వివిధ పార్టీల ప్రతినిధుల సందేహాలను నివృత్తి చేయడంతో పాటు సూచనలు స్వీకరించి తప్పులు లేని ఓటరు జాబితా తయారు చేస్తామన్నారు. కార్యక్రమంలో జాతీయ, రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. బీజేపీ ప్రతినిధులు మర్రి శశిధర్ రెడ్డి, కొల్లూరి ప్రవీణ్ కుమార్, పి.వెంకటరమణ, బహుజన సమాజ్ పార్టీ ప్రతినిధి కె.సందేశ్ కుమార్, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి మల్లంగి విజయ్, సీపీఎం ప్రతినిధి ఎం.శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు రాజేష్ కుమార్, మహ్మమద్ వాజిద్ హుస్సేన్, తెలుగు దేశం పార్టీ ప్రతినిధి ప్రశాంత్ రాజు యాదవ్, ఎంఐఎం నుండి సయ్యద్ ముస్తాక్ తదితరులు పాల్గొన్నారు.