
శాంతిని నెలకొల్పడంలో పీస్ కమిటీలు కీలకం
నగర కొత్వాల్ సీవీ ఆనంద్
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో శాంతిభద్రతలను నెలకొల్పడంలో పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీల పాత్ర కీలకమని సిటీ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. వినాయక చవితి, మిలాద్–ఉన్–నబీ పండుగలు సమీపిస్తున్న నేపథ్యంలో బుధవారం ఆయన అన్ని జోన్లకు సంబంధించిన పీస్ కమిటీల సభ్యులతో భేటీ అయ్యారు. బంజారాహిల్స్‌లోని ఐసీసీసీలో ఉన్న ఆడిటోరియంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కొత్వాల్ మాట్లాడుతూ.. ‘నగరంలో మొత్తం 1500 మంది పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు ఉన్నారు. వివిధ వర్గాల మధ్య అవగాహన, సహకారాన్ని పెంపొందించడంలో సెంట్రల్ పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీ ఎంతో దోహదపడుతోంది. నగరానికే ప్రత్యేకమైన ‘గంగా–జమునా తెహజీబ్’ను (వివిధ మతాల మధ్య సామరస్యం) నిలబెట్టడానికి ఈ కమిటీలు ఎంతో కృషి చేస్తున్నాయి. రానున్న రోజుల్లోనూ తమ ఏరియాలో శాంతిని నెలకొల్పడానికి కమిటీ సభ్యుల సేవలు అవసరం. శాంతి భద్రతలను పరిరక్షించడానికి స్థానిక పోలీసులకు సహకరించాలి. ఈ కమిటీల సభ్యుల కృషి వల్లే నగరానికి మంచి పేరు వచ్చింది. పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీల్లో యువకులను కూడా చేర్చుకోవాలి. పోలీసు అధికారులు సమాజంలోని సభ్యులతో కలిసి, వారి సహాయ సహకారాలు తీసుకుని ముందుకు వెళ్తేనే సరైన పోలీసింగ్ సాకారం అవుతుంది’ అని అన్నారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. సిటీ పోలీసులకు మద్దతుగా ఉంటూ, రాబోయే పండుగలు శాంతియుత వాతావరణంలో జరిగేలా, సమాజంలోని సంఘ వ్యతిరేక కార్యకలాపాలను నిర్మూలించడానికి, ప్రజల్లో సామరస్య భావం, ఐక్యత నెలకొల్పడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో అదనపు సీపీ విక్రమ్ సింగ్ మాన్, ఎస్పీ డీసీపీ కె.అపూర్వ రావు తదితరులు పాల్గొన్నారు.