
రాజీవ్ గాంధీని యువత ఆదర్శంగా తీసుకోవాలి
ఖైరతాబాద్: పారదర్శక పరిపాలన అందించడానికి సాంకేతికతను జోడించాలని ఆనాడే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఆలోచన చేశారని, 18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు కల్పించి దేశ భవిష్యత్‌ను నిర్ణయించే అవకాశం కల్పించారని, కంప్యూటర్‌ను దేశానికి పరిచయం చేసిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. బుధవారం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి ముఖ్యమంత్రి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ యువత రాజీవ్ గాంధీని స్ఫూర్తిగా తీసుకోవాలని, దేశ సమగ్రతను కాపాడేందుకు ఆయన ప్రాణాలర్పించారన్నారు. స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లు కల్పించిన దార్శనికుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. రాజీవ్‌గాంధీ స్పూర్తితోనే ఆనాడు హైదరాబాద్‌లో హైటెక్ సిటీకి పునాది పడిందన్నారు. తాము కూడా రాజీవ్ బాటలో నడుస్తూ సంక్షేమం, అభివృద్ధితో పాటు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ లాంటి సామాజిక సమస్యలకు పరిష్కారం చూపామన్నారు. 21 ఏళ్లు నిండిన వారు శాసనసభకు పోటీ చేసేలా చట్టాన్ని సవరించేందుకు కృషి చేయాలన్నారు. దేశంలో పేదల కలలు సాకారం కావాలంటే దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కావాలని, రాజీవ్ స్ఫూర్తితో రాహుల్ గాంధీని ప్రధానిగా చేసే వరకు విశ్రమించబోమన్నారు. జయంతి కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్‌తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ల చైర్మన్లు పాల్గొని రాజీవ్‌కు నివాళులర్పించారు.
రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తదితరులు
రాజీవ్ స్ఫూర్తితో రాహుల్‌ను ప్రధానిని చేస్తాం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి