
సిటీలో ఎక్కడ చూసినా సమస్యలే..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు విమర్శ
కాచిగూడ: ప్రజా సమస్యలను పరిష్కరించడంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ఆరోపించారు. బుధవారం బర్కత్‌పురలోని బీజేపీ నగర కార్యాలయంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పార్టీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో బీజేపీ కార్యకర్తలు ప్రజలకు అండగా ఉండాలని సూచించారు. సమస్యలను సంబంధిత అధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా చూడాలని ఆయన పార్టీ కార్యకర్తలను కోరారు. హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు లంకల దీపక్‌రెడ్డి మాట్లాడుతూ నగర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 22వ తేదీన ఉదయం 10 గంటలకు ‘ఛలో సెక్రటేరియట్ – సేవ్ హైదరాబాద్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నగరంలో ఎక్కడ చూసినా నీళ్లు విద్యుత్, డ్రైనేజీ, రోడ్ల సమస్యలే దర్శనమిస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు డాక్టర్ ఎన్.గౌతంరావు, ఆనంద్‌గౌడ్, శ్రీనివాస్,శ్యామ్ సుందర్, రాజశేఖర్, మేకల సారంగపాణి, సందీప్, కొంతందీపిక, కేశబోయిన శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.