
ఫెయిలయ్యాననే దిగులుతో బాలుడి ఆత్మహత్య
హస్తినాపురం: ఇంటర్‌లో ఫెయిలవడంతో కొద్ది నెలలుగా మనస్తాపం చెందిన ఓ బాలుడు ఫ్యాన్‌కి చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శారదనగర్‌కాలనీలో నివాసం ఉంటున్న పావని, అనిల్‌కుమార్ దంపతుల పెద్ద కుమారుడు ఉమామహేశ్వర్ (17) గత మార్చిలో రాసిన ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. అప్పటి నుంచి ఇంటి దగ్గరే ఖాళీగా ఉంటున్నాడు. ఇటీవల డిప్రెషన్‌కు లోనయ్యాడు. మంగళవారం ఉదయం ఇంటి నుండి బయటికి వెళ్లి రాత్రి 11 గంటలకు వచ్చి ఒంటరిగా తన బెడ్‌రూంలో పడుకున్నాడు. మధ్య రాత్రి అనిల్‌కుమార్ చిన్న కుమారుడికి వాంతులు కావడంతో వాష్‌రూంకు తీసుకెళ్లేందుకు ఉమా మహేశ్వర్ పడుకున్న బెడ్‌రూం డోర్‌ను కొట్టగా డోర్ లాక్‌చేసుకుని ఉన్నాడు. అతని సెల్‌ఫోన్‌కు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. దీంతో బెడ్‌రూం తలుపులు పగలగొట్టి చూడగా ఉమామహేశ్వర్ చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు. వెంటనే కిందకి దించి ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారని పోలీసులు తెలిపారు. మృతుని తల్లి పావని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.