కుమ్మేసింది | - | Sakshi
Sakshi News home page

కుండపోత వర్షం.. నగరం అతలాకుతలం

Aug 8 2025 9:11 AM | Updated on Aug 8 2025 1:53 PM

Flood relief operations in Chaitanyapuri

చైతన్యపురిలో వరద సహాయక చర్యలు

రోడ్లపై భారీగా వరద నీరు

నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు

నలుదిక్కులా ట్రాఫిక్‌జామ్‌

కిలో మీటర్ల మేర నిలిచిన వాహనాలు

అస్తవ్యస్తంగా మారిన జనజీవనం

సాక్షి, సిటీబ్యూరో: కుండపోత వర్షంతో నగరం చిగురుటాకులా వణికింది. ట్రాఫిక్‌ అతలాకుతలమైంది. జనజీవనం స్తంభించింది. గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు వరుణుడు విరుచుకుపడటంతో ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. అపార్ట్‌మెంట్ల సెల్లార్లలోకి వరద నీరు భారీగా చేరింది. ఓపెన్‌ నాలాలు, డ్రైనేజీల మ్యాన్‌హోళ్లు పొంగిపొర్లాయి. కార్లు, ద్విచక్ర వాహనాలు వరద నీటిలో మునిగి కొట్టుకుపోయాయి. రోడ్లపై మోకాలు లోతు నీరు చేరడంతో వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. చెట్ల కొమ్మలు తీగలపై పడ్డాయి. రాత్రి 11 గంటల వరకు అత్యధికంగా గచ్చిబౌలిలో 13.3 సెం.మీ వర్షపాతం నమోదైంది.

కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌

నగరంలో దంచికొట్టిన వర్షంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ అయింది. రాత్రి పొద్దుపోయే దాకా వాహనాలు ముందుకు కదలలేదు. ఖైరతాబాద్‌ నుంచి బేగంపేట్‌, మెహిదీపట్నం నుంచి గచ్చిబౌలి, గచ్చిబౌలి నుంచి కొండాపూర్‌, పంజాగుట్ట నుంచి గచ్చిబౌలి, కూకట్‌పల్లి నుంచి మియాపూర్‌, శేరిలింగంపల్లి నుంచి హైటెక్‌ సిటీ, మాదాపూర్‌, హయత్‌నగర్‌ నుంచి మలక్‌పేట, బషీర్‌బాగ్‌ నుంచి కోఠి, ట్యాంక్‌బండ్‌ నుంచి ఎస్పీరోడ్‌, ఆర్పీరోడ్‌ వరకు భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

జంట జలాశయాలకు జలకళ

జంట జలాశయాలకు జల కళ వచ్చింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో హిమాయత్‌ సాగర్‌, ఉస్మాన్‌ సాగర్‌లకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. హిమాయత్‌ సాగర్‌ ఒక గేట్‌ను గురువారం రాత్రి 10 గంటలకు జలమండలి అధికారులు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం హిమాయత్‌ సాగర్‌ కు 1000 క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో రాగా.. 350 క్యూసెక్కుల అవుట్‌ ఫ్లో ఉంది.

వర్షపాతం ఇలా

 ప్రాంతం; సెంటీ మీటర్లు

శ్రీనగర్‌కాలనీ;12.0

గచ్చిబౌలి; 13.3

సరూర్‌నగర్‌; 12.0

ఖైరతాబాద్‌; 11.8

ఉప్పల్‌; 11.0

ఎల్బీనగర్‌; 10.5

యూసుఫ్‌గూడ; 11.6

రాత్రి 11 గంటల వరకు నమోదైన వర్షపాతం ఇలా

మైత్రివనం; 10.3

లింగోజిగూడ; 8.7

బండ్లగూడ; 9.6

గోల్కొండ; 8.9

షేక్‌పేట్‌; 9.4

న్యూనాగోల్‌; 9.9

నాగోల్‌; 9.7

బంజారాహిల్స్‌; 10.1

విభాగం; కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌

ఎన్‌డీఆర్‌ఎఫ్‌; 83330 68536

హైడ్రా; 91541 70992

జలమండలి ; 99499 30003

జీహెచ్‌ఎంసీ; 81259 71221

హైదరాబాద్‌ కలెక్టరేట్‌; 74166 87878

అగ్నిమాపక; 99499 91101

ట్రాఫిక్‌; 87126 60600

సైబరాబాద్‌; 85004 11111

రాచకొండ ; 87126 62999

డయల్‌ – 100; 87126 81241

టీజీఎస్‌పీడీసీఎల్‌; 79015 30966

ఐసీసీసీ;  87125 96106

ఆర్టీసీ ; 94440 97000

108; 91007 99129

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement