
బతుకుదెరువుకు వలసవచ్చి...అనుకోని ఘటనతో అసువులుబాసి !
మేడ్చల్‌రూరల్ : బతుకు దెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చిన ఓ యువకుడు రోడ్డుపై వెళుతుండగా ఓ భవనంలో గ్యాస్ సిలిండర్ పేలడంతో మృతి చెందిన సంఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..మెదక్ జిల్లా, మక్తభూపతిపూర్‌కు చెందిన కర్రోళ్ల శివరాం, రాంబాయి దంపతుల కుమారుడు మురళి(25) నగరానికి వలస వచ్చి స్నేహితులతో కలిసి స్థానిక వివేకానంద విగ్రహం సమీపంలోని ఇంట్లో అద్దెకు ఉంటూ ఫ్లిప్‌కార్ట్‌లో పని చేస్తున్నాడు. సోమవారం రాత్రి ఇంట్లో భోజనం చేసిన అనంతరం బయటికి వచ్చిన అతను మార్కెట్ రోడ్డులో నడుచుకుంటూ వెళ్తున్నాడు. అదే సమయంలో సమీపంలోని ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించింది. పేలుగు ధాటికి ఎగిరి వచ్చిన భవన శకలాలు అతడికి తగడంతో తీవ్రంగా గాయపడిన మురళి అక్కడికక్కడే మృతి చెందాడు. మంగళవారం ఉదయం వరకు అతను గదికి తిరిగా రాకపోవడంతో అనుమానం వచ్చిన మురళి స్నేహితులు అతడి సెల్‌ఫోన్‌కు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. మురళి కుటుంబ సభ్యులు, బంధువులు కూడా అతడితో మాట్లాడేందుకు ప్రయత్నించగా స్విచ్ఛాఫ్ రావడంతో వారు అతడి స్నేహితులను వాకాబు చేయగా సోమవారం రాత్రి బయటికి వెళ్లి తిరిగి రాలేదని చెప్పారు. దీంతో బుధవారం మురళి కుటుంబ సభ్యులు మేడ్చల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. వివరాలు సేకరించిన పోలీసులు సోమవారం జరిగిన పేలుడు ఘటనలో మృతి చెందిన వ్యక్తి ఫొటో చూపగా వారు అతడిని మురళిగా గుర్తించారు. శివరాం, రాంబాయి దంపతులకు నలుగురు సంతానం. వారిలో ముగ్గురు కుమార్తెలు కాగా, మురళి ఒక్కడే కుమారుడు. కుటుంబానికి ఆసరాగా ఉన్న ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడం ఆ కుటుంబంలో తీరని విషాదం నింపింది. గురువారం గాంధీ మార్చురీలో ఉన్న మురళి మృతదేహాని పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో మృతుడి గుర్తింపు