
మహా దారిలో..
ఔటర్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు గ్రీన్‌ఫీల్డ్ రోడ్లు
● జాతీయ, రాష్ట్ర రహదారులతో అనుసంధానం
● మొదటి దశలో 10 రహదారులకు హెచ్‌ఎండీఏ ప్రణాళికలు
సాక్షి, సిటీబ్యూరో: ఔటర్‌రింగ్ రోడ్డు నుంచి కొత్తగా నిర్మించనున్న రీజినల్ రింగ్‌రోడ్డు వరకు గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్ల పనులకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) సన్నాహాలు చేపట్టింది. రావిర్యాల నుంచి ఆమన్‌గల్ మార్గంలో నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్ తరహాలోనే మరో 10 ప్రాంతాల్లో రహదారుల విస్తరణకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఔటర్ నుంచి రీజినల్ రింగ్‌రోడ్డుకు జాతీయ, రాష్ట్ర రహదారులను అనుసంధానం చేస్తూ వీటిని నిర్మించనున్నారు. ఓఆర్‌ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు ప్రజలు సాఫీగా రాకపోకలు సాగించేందుకు అనుగుణంగా విశాలమైన రహదారులు అందుబాటులో ఉంటాయని హెచ్‌ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. ఉత్తర, దక్షిణ భాగాలుగా రెండు దశల్లో నిర్మించనున్న సుమారు 350 కిలోమీటర్ల మేర అనుసంధానం చేసే విధంగా గ్రీన్‌ఫీల్డ్ రోడ్లను దశలవారీగా నిర్మించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఇరువైపులా టౌన్‌షిప్‌లు
ఔటర్ నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వరకు ఆధునిక సదుపాయాలతో టౌన్‌షిప్‌లు నిర్మించనున్నారు. ఇందుకోసం వివిధ ప్రాంతాల్లో రైతుల నుంచి భూములు సేకరించి లోకల్ ఏరియా డెవలప్‌మెంట్ ప్లాన్‌కు అనుగుణంగా లే అవుట్‌లను అభివృద్ధి చేయాలని హెచ్‌ఎండీఏ భావిస్తోంది. వీటిని గ్రీన్‌ఫీల్డ్ రోడ్లకు ఇరువైపులా నిర్మించనున్నారు. ప్రజలు నివాస సముదాయాల నుంచి తేలిగ్గా గ్రీన్‌ఫీల్డ్‌కు చేరుకొనే సదుపాయం ఉంటుంది. ప్రతి లే అవుట్‌ను అన్నిమౌలిక సదుపాయాలతో డిజైన్ చేసేందుకు ప్రతిపాదించారు. రైతుల నుంచి భూములు సేకరించి ఏర్పాటు చేసే లేఅవుట్‌లలో 60 శాతం భూమిని తిరిగి వారికే అందజేయనున్నారు. మిగతా 40 శాతం భూమిని హెచ్‌ఎండీఏ తీసుకోనుంది. ప్రస్తుతం ప్రతిపాదించిన రావిర్యాల– ఆమన్‌గల్ మార్గంలో మొదటి దశలో రేడియల్ రోడ్డుకు ఇరువైపులా కి.మీ పరిధిలో 21 లక్షల చదరపు మీటర్ల (518.92 ఎకరాలు) విస్తీర్ణంలో టౌన్‌షిప్‌ను, రెండో దశలో 500 మీటర్ల పరిధిలో మరొకదానిని అభివృద్ధి చేసే ప్రతిపాదనలు ఉన్నాయి.
త్వరలో రతన్‌టాటా గ్రీర్‌ఫీల్డ్ రోడ్డు పనులు..
ఫ్యూచర్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా ఓఆర్‌ఆర్ రావిర్యాల ఇంటర్‌చేంజ్ నుంచి ఆమన్‌గల్ వరకు నిర్మించనున్న 41.50 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు పనులను హైకోర్టు స్టే ఎత్తివేసిన వెంటనే ప్రారంభించేందుకు హెచ్‌ఎండీఏ అనుబంధ హెచ్‌జీసీఎల్ సంస్థ సిద్ధంగా ఉన్నాయి. ఇందుకోసం రూ.1,665 కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా.రెండోదశలో మీర్‌ఖాన్‌పేట్ నుంచి ట్రిపుల్ ఆర్ వద్ద అమన్‌గల్ వరకు రూ.2,365 కోట్ల వ్యయంతో 22.3 కిలోమీటర్లు నిర్మించనున్నారు.
ఇవీ ప్రత్యేకతలు..
● గ్రీన్‌ఫీల్డ్ రోడ్లు 100 మీటర్ల వెడల్పుతో కూడిన యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేలు. ఆరు లైన్ల ప్రధాన రహదారి (3+3 లేన్)
● భవిష్యత్తులో 8 లైన్‌లకు (4+4) విస్తరించే అవకాశం ఉంటుంది.
● రావిర్యాల–ఆమన్‌గల్ గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు మధ్యలోనే మెట్రో కారిడార్ కోసం 20 మీటర్ల భూమిని కేటాయిస్తారు.ఈ మార్గంలో ఎట్‌గ్రేడ్ (భూమార్గంలో)గా మెట్రో కారిడార్ రానుంది.
● గ్రీన్‌ఫీల్డ్ రోడ్లకు రెండు వైపులా 3–లైన్‌ల సర్వీస్ రోడ్లు ఉంటాయి. 2 మీటర్ల చొప్పున గ్రీన్‌బెల్ట్‌ను (పచ్చదనం) ఏర్పాటు చేస్తారు.
● రెండు వైపులా 3 మీటర్ల సైకిల్ ట్రాక్, 2 మీటర్ల వెడల్పుతో ఫుట్‌పాత్, మరో 2 మీటర్ల యూటిలిటీ కారిడార్‌ను ఏర్పాటు చేయనున్నారు.