
హైదరాబాద్: జూబ్లీహిల్స్ పోలీసులు అదృశ్యమైన ఓ బాలిక ఆచూకీని 5 రోజుల పాటు నిఘానేత్రాలను వడపోసి ఎట్టకేలకు పట్టుకుని భద్రంగా తండ్రికి అప్పగించారు. 5 రోజుల పాటు నిద్రాహారాలు మాని జూబ్లీహిల్స్ హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరరావు నిరంతరం పనిచేయడంతో ఫలితం దక్కింది. వెంకటగిరి నుంచి సికింద్రాబాద్ దాకా అడుగడుగున 200 సీసీ కెమెరాలను వడపోసి సదరు బాలికను క్షేమంగా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే వెంకటగిరిలో నివసించే 15 సంవత్సరాల బాలిక యూసుఫ్‌గూడలోని ఓ పాఠశాలలో 10వ తరగతి చదువుతుంది. 5 నెలల క్రితం ఆ బాలిక తల్లి మృతి చెందగా తల్లిలేని ఆ బాలిక ఒంటరిదై డిప్రెషన్‌లోకి వెళ్లింది. స్కూల్‌కు సరిగా వెళ్లక పోవడంతో ఆమె సోదరుడు మందలించాడు. మనస్థాపానికి గురైన ఆ బాలిక ఈ నెల 10వ తేదీన ఇంట్లో చెప్పకుండా ఓ బ్యాగు తీసుకుని వెళ్లిపోయింది.
తండ్రి ఇచ్చిన సమాచారం మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని పోలీసులు రంగలోకి దిగారు. సీసీ కెమెరాలు చూసే హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరరావు వెంకటగిరిలోని బాలిక ఇంటి వద్ద నుంచి సీసీ కెమెరాలను చూసే ప్రయత్నం మొదలుపెట్టారు. సమీపంలో ఆటో ఎక్కిన ఆమె సికింద్రాబాద్ రైల్వే ష్టేషన్‌లో దిగినట్టు 30 వరకు సీసీ కెమెరాలు పరిశీలించగా గమనించారు. ఆ ఆటో నెంబర్‌ను గమనించి డ్రైవర్‌ను ప్రశ్నించగా ఆటో దిగి రైల్వే స్టేషన్ వెళ్లినట్టు చెప్పారు. 2 రోజుల పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోనూ చుట్టుపక్కల సుమారు 75 సీసీ కెమెరాలు పరిశీలించగా ఓ వ్యక్తితో కలిసి బయటికి వస్తున్నట్టు కనిపించింది. దీంతో ఆల్ఫా హోటల్ చుట్టు పక్కల మళ్లీ సీసీ కెమెరాలను వెతకడం మొదలు పెట్టారు.
ఓ కెమెరాలో ఆ వ్యక్తి స్కూటర్ ఎక్కినట్లుగా గుర్తించారు. ఆ స్కూటర్ వెళ్తున్న రూట్‌లో ఇంకో 50 కెమెరాలు వడపోయగా మహాంకాళి పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ కోసం ఆపినప్పుడు బైక్ నెంబర్ బయట పడింది. 5 రోజుల పాటు కొందరు కానిస్టేబుల్స్ రేయింబవళ్లు గంటల తరబడి సీసీ కెమెరాలను చూస్తుండగా ఎట్టకేలకు బైక్ నంబర్ దొరికింది. ఆ బైక్ నంబర్ సహాయంతో ఆ వ్యక్తి నెంబర్ ట్రేస్ చేశారు. ఆయనను పట్టుకుని ప్రశ్నించగా సదరు బాలిక రైల్వే స్టేషన్‌లో ఏడుస్తూ కనిపించిందని, తాను చనిపోతానని చెప్పిందని, ఆమెకు ధైర్యం చెప్పి అదే రోజు జూబ్లీ బస్‌స్టేషన్‌లో వెయిటింగ్ రూంలో ఉంచామని చెప్పారు. ఆ తెల్లవారి మహాంకాళిలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చేర్చానని చెప్పడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఎట్టకేలకు బాలిక ఆచూకీ దొరకడంతో పోలీసులు బాలికను తండ్రికి అప్పగించారు.