
సంతోష్‌నగర్: సోదరితో తరుచూ గొడవ పడుతున్నాడని ఓ యువకుడు తన బావను గొంతు కోసి హత్య చేసిన సంఘటన సంతోష్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సంతోష్‌నగర్ జమాల్ కాలనీకి చెందిన మహ్మద్ నయీం (33), సబా బేగంకు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది.
వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. కాగా గత కొన్ని రోజులుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం నయీం తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఈ విషయమై చర్చిస్తున్నారు. ఇందులో భాగంగా సబా బేగం తన సోదరుడు సులేమాన్ అహ్మద్ ఆలియాస్ సోఫీకి ఫోన్ చేసి సమాచారం అందించింది.
దీంతో మధ్యాహ్నం మేనమామ రౌషన్‌తో కలిసి ఇంటికి వచ్చిన సులేమాన్ కత్తితో తన బావ మహ్మద్ నయీం గొంతు కోసి హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న సంతోష్‌నగర్ ఏసీపీ మహ్మద్ గౌస్, ఇన్‌స్పెక్టర్ రమేశ్ కుమార్ మృతదేహన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నయీం సోదరుడు మహ్మద్ హకీమ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.