న్యూస్‌రీల్
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ ఇంజనీరింగ్ తాగునీటి విభాగం తీరు అస్తవ్యస్తంగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలో కొంత మంది లైన్‌మెన్లు, ఇంజనీర్లు కలిసి అక్రమ కనెక్షన్లు ఇచ్చి అక్రమార్జన చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కొన్ని డివిజన్లలో ఇంటి నంబర్లు లేకున్నా అక్రమంగా నల్లాలు ఏర్పాటు చేస్తూ జేబులు నింపుకుంటున్నట్లు చర్జ జరుగుతోంది. మహానగర పాలక సంస్థ పరిధిలో 2,63,354 అసెస్‌మెట్లు (ఇళ్లు) ఉన్నాయి. నగరవ్యాప్తంగా నల్లాలు 1,86,905 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. అనధికారిక సమాచారం ప్రకారం.. మరో 15 వేల వరకు అక్రమ నల్లాలు ఉన్నట్లు ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. బల్దియా పరిధిలో 407.7 చదరపు కిలోమీటర్ల పరిధిలో 60 శాతం కాలనీల్లో రోజూ నల్లాలకు నీటి సరఫరా, 25 శాతం కాలనీలకు రెండు మూడు రోజులకోసారి 10 శాతం కాలనీలకు మూడురోజులకోసారి, మరో 5 శాతం కాలనీలకు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ఒక్కో డివిజన్‌లో వంద సంఖ్యలో అక్రమ నల్లాలు ఉన్నాయని, వాటికి నీటి సరఫరా జరుగుతోందని పౌరులు ఆరోపిస్తున్నారు.
నిబంధనల ప్రకారం ఏం చేయాలంటే..
కొత్త నల్లా కనెక్షన్ కావాలంటే తొలుత ఇంటి యజమాని బల్దియాకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తును పరిశీలించి ఆయా ప్రాంతాల్లో ఫిజిబిలిటీని బట్టి అధికారులు నల్లా మంజూరు చేస్తారు. ఇందుకు ప్లాట్ ఏరియా, కనెక్షన్ సైజును బట్టి డిపాటిజ్ చెల్లించాలి. అనంతరం ఏఈ, డీఈ, ఈఈ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ప్రొసీడింగ్ జారీ అవుతుంది. ఇంత ప్రాసెస్ అవసరం లేదంటూ ఎంతో కొంత ఇచ్చేసి పనికానిచ్చుకోవాలని కొందరు యజమానుల నుంచి డబ్బులు దండుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి.
పర్యవేక్షణేది?
బల్దియాకు ప్రతీ ఏడాది నల్లా కనెక్షన్ల ద్వారా చార్జీ లు, తదితర ఫీజుల రూపంలో ఏడాదికి రూ. 34.52 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. కానీ, కేవలం రూ.15 కోట్లు కూడా ఆదాయం రావట్లేదు. నీటి సరఫరా కోసం బల్దియా మాత్రం ఏటా రూ.35 కోట్ల వరకు వివిధ అవసరాల నిమిత్తం ఖర్చు చేస్తోంది. కాగా, స్థానిక సిబ్బందికి తెలియకుండా రోడ్డును తవ్వి ప్రధాన పైపునకు కన్నం పెట్టే పరిస్థితి ఉండదు. సంబంధిత సిబ్బంది పాత్రపై దర్యాప్తు చేస్తే అసలు తంతంగం వెలుగు చేస్తుందని పౌరులు పేర్కొంటున్నారు. కాగా, ఈ విషయంపై బల్దియా ఇంజనీర్లను వివరణ కోరితే, అక్రమ నల్లాలను గుర్తిస్తామని చెబుతున్నారు. ప్రస్తుతం ఎల్‌నినో పరిస్థితులు, ధర్మసాగర్ రిజర్వాయర్‌లో తాగునీటి మట్టం వచ్చే వర్షాకాలం వరకు సరిపోయే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఈనేపథ్యంలో బల్దియా ఇంజనీర్లు, ఉన్నతాధికారులు అక్రమ కనెక్షన్లపై కొరడా ఝుళిపించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


