హన్మకొండ కల్చరల్: తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబం బతుకమ్మ పండుగ అని తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ అన్నారు. శుక్రవారం వేయిస్తంభాల ఆలయంలోని కుడా గార్డెన్‌లో సాహితీవేత్త నాగపురి లక్ష్మి బతుకమ్మ పండుగపై వివిధ జిల్లాలను పర్యటించి శిలాశాసనాల ద్వారా సేకరించిన అంశాలతో కూడిన బతుకమ్మ సంబరాల కరపత్రాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో గంగు ఉపేంద్రశర్మ, జీడబ్ల్యూఎంసీ మాజీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పుప్పాల ప్రభాకర్, వివిధ కులసంఘాల నాయకులు తొనుపునూరి వీరన్న, చొల్లేటి కృష్ణమాచారి, బోడ డిన్న, చీకటి వీరస్వామి, నాగ సోమేశ్వర్, సిద్దోజు వీరన్న, సదానందం, మాదేవిచ వీణ, ధనలక్ష్మి, రాజేశ్వరి, మనెమ్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అమృత హస్తం ఆధ్వర్యంలో అన్నప్రసాదాలు వితరణ చేశారు.
విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలో కొద్ది రోజులుగా నిర్వహిస్తున్న సమ్మెటివ్ అసెస్‌మెంట్ (ఏస్‌ఏ–1) పరీక్షలు శుక్రవారంతో ముగిశాయి. బతుకమ్మ పండుగ దసరా నేపథ్యంలో.. ఈనెల 10 నుంచి 22వ తేదీ వరకు అన్ని యాజమాన్యాల పాఠశాలలకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. ఈనెల 23న పాఠశాలలను పునఃప్రారంభించనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని యాజమాన్యాల జూనియర్ కళాశాలలకు ఈనెల 10వ తేదీ నుంచి 21వ తేదీ వరకు సంబంధిత ఇంటర్‌విద్య ఉన్నతాధికారులు సెలవులు ప్రకటించారు. ఈనెల 22వ తేదీ నుంచి తరగతులు యథావిఽధిగా కొనసాగనున్నాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు కూడా ఈనెల 21వ తేదీ వరకు సెలవులను సంబంధిత అధికారులు ప్రకటించినట్లు సమాచారం.
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈనెల 10న నిర్వహించనున్న వివిధ పరీక్షలను వాయిదా వేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్ శుక్రవారం తెలిపారు. దూరవిద్య పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 10న నిర్వహించాల్సి ఉండగా.. బతుకమ్మ పండుగను పురస్కరించుకొని వాయిదా వేసినట్లు, ఆయా పరీక్షలను ఈనెల 12న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు నిర్వహిస్తామని ఆయన తెలి పారు. అలాగే ఐదేళ్ల ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 10న జరగాల్సి ఉండగా.. వాటిని కూడా వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. ఆయా పరీక్షలను మళ్లీ ఈనెల 12వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
కాశిబుగ్గ: వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో బయోకెమిస్ట్రీ విభాగంలో అసోసియేషన్ ప్రొఫెసర్ (నాన్ మెడికల్) రమేష్ వరుసగా ఐదోసారి ప్రపంచ అత్యుత్తమ శాస్త్రవేత్తల జాబితాలో స్థానం పొందారు. ఇప్పటివరకు ఆయన వందకు పైగా పరిశోధన పత్రాలను జాతీయ, అంతర్జాతీయ శారస్త్‌రీయ జర్నల్స్‌లో ప్రచురించారు. బయోకెమిస్ట్రీ, న్యూరో సైన్సెస్, వైద్య పరిశోధన రంగాల్లో ఆయన చేసిన కృషికి పలు గుర్తింపు లభించాయి. ఈ సందర్భంగా రమేష్‌ను సహచర అధ్యాపకులు అధ్యాపకులు, వైద్యులు, పరిశోధకులు, విద్యార్థులు అభినందించారు. ఈ గుర్తింపుపై ఆయన మాట్లాడుతూ.. వైద్య పరిశోధనల ద్వారా సమాజానికి ఉపయోగపడే శాసీ్త్రయ పరిజ్ఞానాన్ని అందించడమే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు.
కేయూ క్యాంపస్: ఈఏడాది నవంబర్ 28న కేయూలో 24వ స్నాతకోత్సవం నిర్వహించనున్నారు. ఈనేపథ్యంలో విశ్వవిద్యాలయం చాన్స్‌లర్, గవర్నర్ శివ్‌ప్రతాప్ శుక్లాను శుక్రవారం కేయూ వీసీ కె.ప్రతాప్‌రెడ్డి, పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్ హైదరాబాద్ లోక్ భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. స్నాతకోత్సవ నిర్వహణకు సంబంధించిన విధివిధానాలు, ప్రదానం చేయనున్న పీహెచ్‌డీ అవార్డు అభ్యర్థుల సంఖ్య, గోల్డ్‌మెడల్స్ ఇతర ఏర్పాట్లను గవర్నర్‌కు వివరించారు. స్నాతకోత్సవానికి గవర్నర్ వచ్చే అవకాశాలున్నాయి.


