నేడు ఎంగిలి పూల బతుకమ్మ
హన్మకొండ కల్చరల్: ఆడపడుచులు ఆడిపాడి గౌరమ్మను భక్తిశ్రద్ధలతో కీర్తించే పండుగ రానేవచ్చింది. నేడు (శనివారం) పితృ అమావాస్య రోజున ఎంగిలి పూల బతుకమ్మతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజులు మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి సందడి చేయనున్నారు.
వేయిస్తంభాల ఆలయంలో ఏర్పాట్లు
వేయిస్తంభాల ఆలయంలో బతుకమ్మ వేడుకలకు ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయాన్ని విద్యుత్ లైట్లతో అలంకరించారు. మహిళలు ప్రశాంతంగా వేడుకలను నిర్వహించుకోవాలని ఆలయ ఈఓ అనిల్‌కుమార్, ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ కోరారు.
నగరంలో రోడ్లన్నీ రద్దీ..
ఎంగిలిపూల బతుకమ్మ పండుగ నేపథ్యంలో బతుకమ్మను పేర్చడానికి కావాల్సిన రంగులు, తంగేడుపూలు, గునుగు, వివిధ రంగుల్లో ముంచిన గునుగుపూలు, తామర పూలు, చామంతి, బంతి, సీతజడలు, గుమ్మడి ఆకులు మొదలైనవి కొనడానికి వచ్చిన వారితో శుక్రవారం గ్రేటర్ వరంగల్ నగరంలోని రోడ్లు కిక్కిరిసిపోయాయి. యువతులు గాజులు, తదితర అలంకరణ సామగ్రి కొనుగోలు చేస్తూ కనిపించారు. హనుమకొండ చౌరస్తా, కుమార్‌పల్లి, టైలర్‌స్ట్రీట్, అంబేడ్కర్ సెంటర్, అదాలత్ సెంటర్, వరంగల్‌లోని పిన్నావారి వీధి, రామన్నపేట, బట్టలబజార్, కాశిబుగ్గ, గోపాలస్వామి గుడి, హనుమకొండ చౌరస్తా, సుబేదారిలోని అమరవీరుల స్తూపం, కాజీపేటలోని బాపూజీనగర్ తదితర ప్రాంతాల్లో పూల విక్రయాలు జోరుగా సాగాయి.


