● మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్ ఎదుట
బాధితుల నిరసన
ఖిలా వరంగల్ : ఆజంజాహి మిల్లు కార్మికులకు ఇంటి స్థలాలు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేసి మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాల నాయకులు కొమ్ముల సందీప్, బస్కుల హరినారాయణ డిమాండ్ చేశారు. సోమవారం వరంగల్ మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్ ఎదుట కార్మిక నాయకుల ఆధ్వర్యంలో కార్మిక కుటుంబాలు నిరసన వ్యక్తం చేశాయి. అనంతరం కార్మిక నేతలు సందీప్, హరినారాయణ పోలీసులను కలిసి ఇళ్ల పేరుతో పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసిన ఏడుగురిపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందించి మాట్లాడారు. 318 కార్మిక కుటుంబాల నుంచి 200 గజాల ఇంటి స్థలం ఇప్పిస్తామని నమ్మించి రూ.10 వేల నుంచి రూ.30 వేలు వసూలు చేసిన ఆదినారాయణ, ప్రభాకర్, సాంబయ్య, నాగరాజు, చంద్రమోహన్, రాజమౌళి, నర్సింగంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాధితులు పి.ప్రభాకర్, మార్కండేయ, సంజీవ్, యశోద తదితరులు పాల్గొన్నారు.


