పేదరికాన్ని జయించి ప్రొఫెసర్‌గా.. | - | Sakshi
Sakshi News home page

పేదరికాన్ని జయించి ప్రొఫెసర్‌గా..

Oct 6 2026 1:18 AM | Updated on Oct 6 2026 1:18 AM

● సర్వశిక్ష అభియాన్‌తో జీవితం మలుపు

● డాక్టర్‌ పట్టాభిరామ్‌ స్మారక జాతీయ అవార్డుకు మహ్మద్‌ ఆజమ్‌ అలీ ఎంపిక

● ఈ నెల 8న అవార్డు ప్రదానం

హన్మకొండ కల్చరల్‌ : పేదరికం, ఆకలి, అవమానాలు.. చదువుకు దూరం చేసినా పట్టుదలతో విద్యను కొనసాగించి ఉన్నత స్థాయికి ఎదిగారు.. డాక్టర్‌ మహ్మద్‌ అజమ్‌ అలీ. ఒకప్పుడు బాలకార్మికుడిగా గోడలకు పోస్టర్లు అంటించిన ఆయన.. నేడు ఇంజనీరింగ్‌ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పాఠాలు బోధిస్తున్నారు.

బాలకార్మికుడికి ఉపాధ్యాయుల ప్రోత్సాహం

మహ్మద్‌ అహ్మద్‌ హుస్సేన్‌, ఖలీదా బేగం దంపతులకు ఐదో సంతానంగా 1991 ఆగస్టు 5న ఆజమ్‌ అలీ జన్మించారు. కుటుంబ కలహాల వల్ల తండ్రి కుటుంబాన్ని విడిచిపెట్టడంతో బాధ్యతలు తల్లిపై పడ్డాయి. 2003లో ఆర్థిక పరిస్థితుల కారణంగా ఎనిమిదో తరగతిలో చదువు మానేశారు. బాలకార్మికుడిగా పనిచేస్తున్న సమయంలో అందరూ చదవాలి.. అందరూ ఎదగాలి అనే సర్వశిక్ష అభియాన్‌ నినాదం ఆయనలో స్ఫూర్తి నింపింది. ప్రభుత్వ ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో తిరిగి బడిలో చేరి 2006లో పదో తరగతి పూర్తి చేశారు. కరీంనగర్‌ ప్రభుత్వ ఆర్ట్స్‌ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌, శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వ డిగ్రీ, పీజీ, కళాశాలలో డిగ్రీ, ఎం,ఏ ఇంగ్లిష్‌, కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎం.ఎడ్‌ పూర్తి చేశారు. అనంతరం ఆంగ్ల సాహిత్యంలో పీహెచ్‌డీ సాధించారు.ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్‌గా డాక్టర్‌ మహ్మద్‌ అజమ్‌ అలీ పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. సేవలకు గుర్తింపుగా 2013లో ఇందిరాగాంధీ జాతీయ ఉత్తమ వలంటీర్‌ అవార్డు అందుకున్నారు. ఢిల్లీలో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా పురస్కారాన్ని స్వీకరించారు. విద్యతోనే వెలుగు అనే లక్ష్యంతో చమక్‌ ఫౌండేషన్‌ స్థాపించి ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో వ్యక్తిత్వ వికాసం, కెరీర్‌ గైడెన్స్‌, ప్రేరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన సేవలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, మాజీ గవర్నర్‌ డాక్టర్‌ తమిళసై సౌందరరాజన్‌, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, సామాజికవేత్త అన్నా హజారే తదితరులు ప్రశంసించారు.

డాక్టర్‌ పట్టాభిరామ్‌

స్మారక జాతీయ అవార్డుకు ఎంపిక..

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులను మానసికంగా చైతన్యం నింపుతున్నందుకు ఆజమ్‌ అలీని డాక్టర్‌ పట్టాభిరామ్‌ స్మారక జాతీయ అవార్డుకు ఎంపిక చేసినట్లు తెలంగాణ సైకాలాజికల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ అబ్దుల్‌ కరీం తెలిపారు. ఈ నెల 8న హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంలో అవార్డు ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు. వాగ్దేవి ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ శశిధర్‌, విభాగాధిపతి రాజేష్‌ఖన్నా ఆజమ్‌ అలీని అభినందించారు.

ఆకలితో చదువు మానేసిన..

ఒకప్పుడు పేదరికం, ఆకలితో చదువు మానేసినా. ప్రభుత్వ ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో చదువుకున్నా. నేడు ఇంజనీరింగ్‌ కళాళాలలో వేలాది మంది విద్యార్థులకు చదువు చెబుతున్నా. జీవితం చెప్పే సందేశం ఒక్కటే విద్య మనిషిని మార్చుతుంటే.. సేవా సమాజాన్ని మార్చుతుందని నమ్మకం.

– డాక్టర్‌ మహ్మద్‌ ఆజమ్‌ అలీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement