పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు | - | Sakshi
Sakshi News home page

పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు

Oct 6 2026 1:18 AM | Updated on Oct 6 2026 1:18 AM

వర్ధన్నపేట : వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట మున్సిపల్‌ చైర్మన్‌ పాలకుర్తి సారంగపాణి కుమారుడు శ్రీకాంత్‌ తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఓ యువతి వర్ధన్నపేటలోని చైర్మన్‌ ఇంటి ఎదుట సోమవారం కుటుంబీకులు, దళిత సంఘాలతో కలిసి ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శ్రీకాంత్‌ మూడేళ్ల క్రితం దసరా వేడుకల్లో కలిసి తనను ప్రేమిస్తున్నానని చెప్పాడన్నారు. దీంతో అతడిని నమ్మి సన్నిహితంగా మెలిగానని తెలిపింది. వేములవాడ ఆలయానికి తీసుకెళ్లి తనను పెళ్లి చేసుకుంటానని చెప్పాడన్నారు. అనంతరం తన కుటుంబీకులకు పరిచయం చేశాడని వివరించింది. ఈక్రమంలో మూడేళ్ల పాటు శ్రీకాంత్‌తో సన్నిహితంగా ఉండగా మూడు సార్లు గర్భం దాల్చానన్నారు. అయితే అతడి సూచనల మేరకే తొలగించుకున్నానన్నారు. ఈ క్రమంలో శ్రీకాంత్‌ ఒక్కసారిగా తనను దూరం పెట్టడంతో మోసపోయినట్లు అర్థం చేసుకున్నానని కన్నీరుమున్నీరైంది. తాను శ్రీకాంత్‌ నాన్న సారంగపాణిని కలిసినా ఆయన నమ్మలేదని, దీంతో తన వద్ద ఉన్న ఆధారాలు చూపానన్నారు. దీంతో కొంత సమయం అడిగాడని, తర్వాత ఆయన కూడా ఏమి చెప్పకపోవడంతో ఎమ్మెల్యే కే.ఆర్‌ నాగరాజును కలిశానన్నారు. ఈ సమయంలో పెళ్లి చేసుకుంటానని శ్రీకాంత్‌ తెలుపగా తండ్రి సారంగపాణి కూడా ఒప్పుకున్నాడన్నారు. తీరా మొఖం చాటేయడంతో ప్రస్తుతం ఆందోళన చేస్తున్నానని తెలిపింది. ఆందోళనపై సమాచారం అందుకున్న ఎస్సై రాజు, సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సదరు యువతిని సముదాయించి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి న్యాయం చేస్తామని తెలిపారు. అయితే తనకు వారిపై కేసు పెట్టే ఉద్దేశం లేదన్నారు. తనకు న్యాయం జరిగే వరకూ ఇంటి ఎదుట ఉంటానని భీష్మించుకుంది. కాగా, సదరు యువతికి న్యాయం చేయాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. యువతి వాంగ్మూలం, సాక్షులను పరిగణనలోకి తీసుకుని శ్రీకాంత్‌తో చట్ట ప్రకారం పెళ్లి జరిపించాలన్నారు.

వంటావార్పుతో నిరసన..

ఇంటి ఎదుట బైఠాయించిన యువతికి మద్దతుగా నిలిచిన దళిత సంఘాల నాయకులు రాత్రి సమయంలో చైర్మన్‌ ఇంటి ఎదుట వంటా వార్పుతో నిరసన తెలిపారు. శ్రీకాంత్‌తో పెళ్లి జరపాలని, అంత వరకు ఇంటి ఎదుట నుంచి కదిలేది లేదని బాధిత యువతి స్పష్టం చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

వర్ధన్నపేట మున్సిపల్‌ చైర్మన్‌ కుమారుడు లైంగికంగా వాడుకున్నాడు

మూడుసార్లు గర్భస్రావం చేయించాడు: బాధిత యువతి ఆరోపణ

అతడి ఇంటి ఎదుట ఆందోళన

దళిత సంఘాల మద్దతు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement