హన్మకొండ : కాలిపోయిన డిస్ట్రిబ్యూషన్ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల స్థానంలో కొత్తవి బిగింపులో జాప్యం చేయడంపై టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి 18 సర్కిళ్ల సూపరింటెండింగ్ ఇంజనీర్లు, డీఈలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా, డివిజన్ల వారీగా ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడం, నిర్వహణ, రోలింగ్ స్టాక్, మరమ్మతులపై సమీక్షించారు. ట్రాక్టర్‌తో పంటలకు నీరందించే పరిస్థితి తీసుకురావడంపై సంబంధిత అధికారుల తీరుపై మండిపడ్డారు. కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లను మూడ్రోజుల వరకు మార్చకపోవడంతో తనకు తరచూ కాల్స్ వస్తున్నాయని, పత్రికల్లో కథనాలు వస్తున్నాయని ప్రత్యేకంగా కొన్ని జిల్లాల పరిస్థితిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లను వెంటనే మార్చకుండా, సకాలంలో సమాచారం ఇవ్వకుండా, జాప్యం చేస్తూ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న ఏఈలు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావం, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వేసవి కాలంలో విద్యుత్ వినియోగం పెరిగే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు. డైరెక్టర్ టి.మధుసూదన్, చీఫ్ ఇంజనీర్లు తిరుమల్ రావు, అశోక్, గౌతమ్ రెడ్డి, సురేందర్, జీఎంలు వాసుదేవ్, ప్రభావతి, శ్రీనివాస్, విజేందర్ రెడ్డి, బాబు రావు పాల్గొన్నారు.
టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి
ట్రాన్స్‌ఫార్మర్ల బిగింపు జాప్యంపై ఆగ్రహం


