హన్మకొండ కల్చరల్: వరంగల్ భద్రకాళి ఆలయ సమీపంలోని చెరబండరాజు నగర్ కాలనీలోని గుడిసెలను కూల్చేసేందుకు వచ్చిన ‘కుడా’, రెవెన్యూ అధికారులను కాలనీ గుడిసెవాసులు అడ్డుకున్నారు. ఈమేరకు శనివారం గుడిసెలను కూల్చడానికి వచ్చిన అధికారులను అడ్డుకుని మహిళలు అధిక సంఖ్యలో ప్రతిఘటించడంతో అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఖాళీ చేయడానికి సమ్మతించిన గుడిసెలను మాత్రమే తొలగించడానికి వచ్చామని ‘కుడా’ ఏఈ వరుణ్ తెలిపారు.
వరంగల్ అర్బన్: అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలని కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్‌పర్సన్ గుండు సుధారాణి ఆదేశించారు. శనివారం హనుమకొండలోని కుడా కార్యాలయంలో అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా సుధారాణి మాట్లాడుతూ.. వరంగల్‌లో అత్యంత ప్రాముఖ్యం కలిగిన భద్రకాళి దేవాలయం మాడవీధులు, ఇన్నర్ రింగ్ రోడ్డు పనులు, వరంగల్ బస్‌స్టేషన్, గ్రీనరీ పనులను ముమ్మరం చేయాలన్నారు. సమీక్షలో కుడా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ అజిత్‌రెడ్డి, హార్టికల్చర్ ఆఫీసర్ ఆసిఫ్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మీర్జా అస్రఫ్, డీఈ శ్రీకాంత్, ఏఈ భరత్ పాల్గొన్నారు.
కేయూ క్యాంపస్: ఉత్తరప్రదేశ్‌లో జరగబోయే ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ మెన్ బాక్సింగ్ పోటీలకు, రాజస్థాన్‌లో జరిగే ఉమెన్ బాక్సింగ్ పోటీలకు శనివారం కాకతీయ యూనివర్సిటీలో క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు. ప్రతిభ చూపిన వారిని ఎంపిక చేసినట్లు కేయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ డాక్టర్ టి.శాస్త్రి తెలిపారు. ఎంపికల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ జె. సోమన్న, జాయింట్ సెక్రటరీ మట్టెడ కుమార్, సెలక్షన్స్ ఇన్‌చార్జ్ డాక్టర్ కుమార్, కోచ్ రమేశ్, సెలెక్టర్లు మౌనిక, పవన్ పాల్గొన్నారు.
హన్మకొండ: రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్‌తో అనేక ప్రయోజనాలున్నాయని టీజీ ఎన్పీడీసీఎల్ చీఫ్ ఇంజనీర్లు కె.వెంకటరమణ, కె.గౌతంరెడ్డి అన్నారు. వరంగల్ ఓ సిటీలోని ఎన్పీడీసీఎల్ వరంగల్ సబ్ డివిజన్ కార్యాలయంలో సేవా సేతు కార్యక్రమంలో భాగంగా సోలార్ ప్లాంట్ ఏర్పాటు, ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. బ్యాంకర్లు రుణ సదుపాయంపై విద్యుత్ వినియోగదారులకు అవగాహన కల్పించారు. ముగింపు సమావేశంలో చీఫ్ ఇంజనీర్లు వెంకటరమణ, గౌతంరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజీలి యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని, రాయితీ పొందాలని విద్యుత్ వినియోగదారులకు సూచించారు. వరంగల్ ఎస్‌ఈ ఎ.ఆనందం మాట్లాడుతూ.. మూడు రోజులు నిర్వహించిన అవగాహన సదస్సులో 50 మంది వినియోగదారులు సోలార్ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రెడ్ కో జిల్లా మేనేజర్ జి.రాజేందర్, ఎన్పీడీసీఎల్ డీఈ ఎస్.మల్లికార్జున్, ఏడీఈ కిశోర్, ఏఈలు, సిబ్బంది, 20 మంది సోలార్ వెండర్లు, 10 బ్యాంకులు పాల్గొన్నాయి.
న్యూశాయంపేట: అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్‌లో శిక్షణ అందించేందుకు జిల్లా పరిధిలోని అర్హులైన బీసీ లా గ్రాడ్యుయేట్స్ నుంచి దరఽఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉపసంచాలకురాలు, బీసీ సంక్షేమ శాఖ అధికారి పుష్పలత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులు ఈనెల 20 వరకు అందజేయాలని, పూర్తి వివరాల కోసం హనుమకొండ లష్కర్‌బజార్‌లోని బీసీ సంక్షేమాధికారి కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.


