హన్మకొండ: భారతీయ జనతా పార్టీ నవంబర్‌లో రెండుగా చీలడంతో పాటు ఒక వర్గం కాంగ్రెస్‌లో చేరడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రాంరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్‌లో ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశానికి మంచి రోజులు రాబోతున్నాయన్నారు. కేంద్ర ముఖ్య ఎన్నికల అధికారి జ్ఞానేశ్ కుమార్‌ను పదవిని తొలగించాలని, అప్పటి వరకు పోరాటం ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈక్రమంలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఈ నెల 5న హనుమకొండలోని అంబేడ్కర్ విగ్రహం నుంచి హనుమకొండ కలెక్టరేట్ వరకు భారీ ఎత్తున ప్రజాస్వామ్య పరిరక్షణ పాదయాత్ర నిర్వహించనున్నట్లు చెప్పారు. 6–8 తేదీల్లో జిల్లాలోని అన్ని మండలాలు, పట్టణాలు, డివిజన్ల వారీగా ఇండియా కూటమి పార్టీలతో కలిసి సంయుక్త సన్నాహక సమావేశాలు నిర్వహిస్తామని, క్షేత్రస్థాయి కార్యకర్తలను సమీకరించి జ్ఞానేష్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ తీర్మానాలు చేస్తామన్నారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ భయంకరమైన నీచానికి దిగజారిందని, నీతులు చెబుతూ దుర్మార్గానికి ఒడిగడుతోందని ధ్వజమెత్తారు. దేశానికి సేవ చేశామని చెప్పుకుని ఓట్లు అడగకుండా సెంటిమెంట్‌తో ఓట్లు వేయించుకుని కొన్నిసార్లు ఓటు చోరీ చేసి, మరోసారి గెలిచిందని దుయ్యట్టారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ, అర్హులైన సామాన్యుల, పేదల ఓట్లను అక్రమంగా తొలగిస్తున్నారని మండిపడ్డారు. తొలగించిన ప్రతీఓటును వెంటనే పునరుద్ధరించాలని, వివాదాస్పదంగా మారిన ఎస్‌ఐఆర్ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి జి.ప్రభాకర్ రెడ్డి, న్యూడెమొక్రసీ నాయకుడు నున్నా అప్పారావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు మాట్లాడారు. సమావేశంలో ఆయా పార్టీల నాయకులు చిల్లా రాజేంద్ర ప్రసాద్, కర్రె భిక్షపతి, దుద్దిళ్ల శ్రీనుబాబు, సంగ వెంకట్రాజం, పులి ప్రియాంక అనిల్, బంక సరళ సంపత్, కూర వెంకట్, పింగిలి వెంకట్రామ్ నరసింహారెడ్డి, గంగుల శ్రీనివాస్ రెడ్డి, పోలెపల్లి బుచ్చిరెడ్డి, వీసం సురేందర్‌రెడ్డి, టి.ఉప్పలయ్య, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌లో ఓ వర్గం చేరబోతోంది..
జ్ఞానేష్ కుమార్‌ను
తొలగించే వరకు పోరాటం
ఈ నెల 5న హనుమకొండలో
భారీ ర్యాలీ
హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు
ఇనగాల వెంకట్రాంరెడ్డి


