ఖిలా వరంగల్: మామునూరు ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి పనులపై వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద శనివారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చేపడుతున్న అభివృద్ధి పనుల నేపథ్యంలో నెక్కొండ ప్రధాన రహదారిని మూసివేయాల్సి వస్తే ప్రత్యామ్నాయ మార్గాల ఏర్పాటుపై చర్చించారు. ప్రజలకు ఇబ్బందుల్లేకుండా గాడిపల్లి, గుంటూరుపల్లి, నక్కలపల్లి గ్రామాలకు లింక్ రోడ్ల నిర్మాణంపై అధికారులు చర్చించారు. ఆయా శాఖల పరిధిలో చేపట్టాల్సిన పనులు, అవసరమైన ఏర్పాట్లపై కలెక్టర్ సత్యశారద అధికారులతో సమీక్షించారు. అదనపు కలెక్టర్ ఎల్.కిశోర్‌కుమార్, ఆర్డీఓ సుమ, తహసీల్దార్ ఇక్బాల్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సురేశ్, ఈఈ రాజేందర్, ఇరిగేషన్ ఎస్‌ఈ మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.
అనుమతి లేని ఆస్పత్రులపై చర్యలు
న్యూశాయంపేట: అనుమతి లేని ఆస్పత్రులు, డయాగోస్టిక్ కేంద్రాలపై చర్యలు తప్పవని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద హెచ్చరించారు. క్లినికల్ ఎస్టాబ్లిస్‌మెంట్స్ యాక్ట్ నిబంధనలు తప్పని సరిగ్గా పాటించాలని ఆమె ఆదేశించారు. కలెక్టరేట్‌లో తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిస్‌మెంట్స్ యాక్ట్‌కు సంబంధించిన జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ సమావేశం శనివారం జరిగింది. డీఎంహెచ్‌ఓ బి.రాజారెడ్డి జిల్లాలో యాక్ట్ అమలు పర్యవేక్షణకు సంబంధించిన నివేదికను కమిటీ సభ్యులకు అందించారు. జిల్లాలో కొత్త రిజిస్ట్రేషన్, రెన్యువల్ కోసం సమర్పించిన దరఖాస్తులను కమిటీ పరిశీలించింది. ఈసమావేశంలో అదనపు కలెక్టర్ వైవీ గణేశ్, డీసీపీ కవిత, ఐఎంఏ డాక్టర్ వెంకట్‌స్వామి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.


