కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
హన్మకొండ అర్బన్: వయోవృద్ధులు దిక్సూచీలు అని, వారిని ప్రతి ఒక్కరూ బాధ్యతగా చూసుకోవాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం కలెక్టరేట్‌లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సమన్వయంతో మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ వయోవృద్ధులకు ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రస్థాయిలో ఇటీవల పురస్కారం పొందిన సీనియర్ సిటిజన్ ఫోరం కమిటీ సభ్యులను అభినందించారు. అనంతరం కలెక్టర్ వయోవృద్ధులను సన్మానించారు. జెడ్పీ సీఈఓ, స్థానిక సంస్థల ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ బి.శేషాద్రి, డీఆర్డీఓ మేన శ్రీను, జిల్లా సంక్షేమ అధికారి ఎం.విశ్వజ, డీఎంహెచ్‌ఓ అప్పయ్య, సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్ బెంచ్ మెంబర్ అనితారెడ్డి, అదనపు డీఆర్డీఓ వెంకటేశ్, జీడబ్ల్యూఎంసీ అదనపు కమిషనర్ సమ్మయ్య, సెర్ప్ ప్రోగ్రాం మేనేజర్ కరుణాకర్, సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు దామెర నర్సయ్య, వెల్ఫేర్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ చంద్రమౌళి పాల్గొన్నారు.


