కాజీపేట: చెరువుల్లో గుర్రపు డెక్క ప్రాణాంతకంగా మారుతోంది. కాజీపేట మండలంలోని పలు చెరువులు, కుంటలు గుర్రపు డెక్కతో పూర్తిగా నిండిపోయాయి. అసలే ఎలినో ప్రభావంతో వర్షాలు సరిపడా కురవక చెరువుల్లో అంతంత మాత్రంగానే నీరు చేరింది. దీంతో పట్టణ శివారులోని చెరువుల్లోని నీటిని పశువులు కూడా తాగలేకపోతున్నాయి. గుర్రపు డెక్క కారణంగా చెరువుల పరిసరాలన్నీ దుర్గంధంగా మారుతున్నాయి. దోమలు, క్రిమికీటకాలు పెరుగుతున్నాయి. స్థానికులు కాలుష్య వ్యాప్తితో ఆందోళన చెందుతున్నారు.
పట్టించుకోని అధికారులు
గుర్రపు డెక్క వల్ల దోమలు పెరిగి విష జ్వరాల బారిన పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తునఆనరు. అయినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సోమిడి ఎల్లమ్మ చెరువులో నీళ్లు తాగేందుకు దిగిన పలు గేదెలు గుర్రపు డెక్కలో చిక్కుకుని బయటకు రాలేక ఇబ్బంది పడ్డాయి. కాపరులు, యజమానులు శ్రమించి అతికష్టం మీద బయటకు తీసుకొచ్చారు.
డ్రెయినేజీ నీటి ప్రభావంతో..
పట్టణంలోని డ్రెయినేజీ నీరు చెరువుల్లో చేరుతుండడంతో గుర్రపు డెక్క పెరుగుతోంది. సోమిడి గ్రామంలోని పలు డ్రెయినేజీల నీరు నేరుగా చెరువులోకే చేరుతోంది. ఫలితంగా నీటి నాణ్యత తగ్గడంతో ఆక్సిజన్ శాతం పడిపోతోంది. మురుగు నీరు చెరువులో చేరకుండా మున్సిపల్ సిబ్బంది తగిన చర్యలు చేపట్టడంలో విఫలమవుతున్నారు. దీంతో చెరువులోని చేపలు, జలచరాలు చనిపోతున్నాయి. చేపల పెంపకం, వేట కష్టమవుతోందని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. నీటిపారుదల శాఖ అధికారులు స్పందించి చెరువుల్లో విపరీతంగా పెరుగుతున్న గుర్రపు డెక్కను తొలగించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
కాజీపేటలోని పలు చెరువుల్లో
కుప్పలు తెప్పలు
తొలగింపులో అధికారుల నిర్లక్ష్యం
మత్స్యకారులకు తప్పని పాట్లు


