హన్మకొండ అర్బన్: భద్రకాళి దేవాలయంలో నిర్వహించనున్న దేవీ శరన్నవరాత్రుల మహోత్సవాలకు హాజరుకావాలని కోరుతూ హనుమకొండ కలెక్టరేట్‌లో కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌కు ఆలయ అధికారులు శనివారం ఆహ్వాన పత్రికను అందజేశారు. భద్రకాళి దేవాలయంలో ఈనెల 11 నుంచి 21వ తేదీ వరకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు, కల్యాణోత్సవం, ఊరేగింపు తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వారు వివరించారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణ అధికారి రామల సునీత, సూపరింటెండెంట్ హరినాథ్ తదితరులు పాల్గొన్నారు.
మామునూరు: భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జ్‌గా మామునూరుకు చెందిన మల్లాడి తిరుపతి రెడ్డి నియమితులయ్యారు. పార్టీ కోసం మూడు దశాబ్దాలుగా వివిధ హోదాల్లో పనిచేస్తూ, సంస్థాగత బలోపేతానికి చేస్తున్న కృషికి ఆయనకు ఈ గుర్తింపు దక్కింది. 1999లో యువ మోర్చా మండల ప్రధాన కార్యదర్శిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన తిరుపతి రెడ్డి.. మండల అధ్యక్షుడు, జిల్లా ప్రచార కార్యదర్శి, వరంగల్ పార్లమెంట్ కన్వీనర్, కిసాన్‌మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం, వరంగల్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. రాష్ట్ర అధ్యక్షుడి ఆదేశాల మేరకు ఆయనకు బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వాపురం లక్ష్మీనరసయ్య కిసాన్ మోర్చా కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జ్‌గా నియామక పత్రాలు జారీచేశారు.
ఖిలా వరంగల్: ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కుడా చైర్‌పర్సన్ గుండు సుధారాణిని ఎంసీపీఐ (యూ) నగర కార్యదర్శి మాలోతు సాగర్, తదితరులు శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు.


