కాళోజీ సెంటర్: కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు సమీపంలో కేజీ నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలను తక్షణమే ఏర్పాటు చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మర్రి మహేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పీడీఎస్‌యూ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో వరంగల్ డీఈఓ కార్యాలయంలో సూపరింటెండెంట్ బాబ్జీకి శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులోని పలు సంస్థల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు కుటుంబాలతో కలిసి పనిచేస్తున్నారని తెలిపారు. సమీపంలో పాఠశాల సదుపాయం లేకపోవడంతో వారి పిల్లలు విద్యకు దూరమవుతున్నారని పేర్కొన్నారు. సుమారు 300 మంది విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని టెక్స్‌టైల్ పార్కు సమీపంలోనే కేజీ నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా నాయకులు సంతోష్, సాగర్, హేశ్వంత్, స్టాలిన్ పాల్గొన్నారు.


