క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కరువు..
నగరంలో పాత భవనాలను పట్టించుకోని బల్దియా
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) పరిధిలో పురాతన భవనాలు భయపెడుతున్నాయి. వరంగల్, హనుమకొండ, కాజీపేటతోపాటు విలీన గ్రామాల్లో దశాబ్దాల క్రితం నిర్మించిన ప్రైవేట్ భవనాల పరిస్థితి దారుణంగా తయారైంది. వర్షాలు చెదురుమదురుగా కురుస్తున్నాయి. భారీ వర్షాలు కురిస్తే ఏ సమయంలో ఏ ఇల్లు కూలుతుందోనని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
నిర్ధారించలేకపోతున్న టౌన్‌ప్లానింగ్ సిబ్బంది
శిథిలావస్థకు చేరిన పాత భవనాలను గుర్తించడంలో బల్దియా టౌన్‌ప్లానింగ్, ఇంజనీరింగ్ సిబ్బంది పూర్తిగా విఫలం చెందారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవాలు కళ్ల ముందు ఉన్నా అధికారులు చెప్పే మాటలకు, చేతలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. శిథిలావస్థకు చేరిన భవనాలు ఎప్పడు నేలమట్టమవుతాయోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అయినా అధికారుల్లో స్పందన కానరాకపోవడం దురదృష్టకరమని పలువురు పేర్కొంటున్నారు. వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లో పాత భవనాలు గుర్తించాలి. పన్నుల విభాగం సిబ్బంది ఎన్ని ఏళ్ల నుంచి పన్నులు చెల్లిస్తున్నారనే విషయం తెలుసుకొని, శిథిలావస్థకు చేరిన భవనాలపై పట్టణ ప్రణాళిక విభాగానికి ఫిర్యాదు చేయాలి. ఇంజనీర్ల నుంచి నిర్మాణం, దాని స్థితిగతులను గుర్తించాలి. ఒకవేళ ప్రమాదం పొంచి ఉందని తేలితే టౌన్‌ప్లానింగ్ అధికారులు సంబంధిత భవన యజమానులకు నోటీసులు జారీ చేయాలి. 10 రోజుల తర్వాత నోటీసుపై స్పందించకపోతే చివరి నోటీసు జారీచేసి మరో మూడు రోజుల గడువు ఇచ్చికూల్చివేతలు చేపట్టాలి. అడ్డుపడిన యజమానిపై అవసరమైతే క్రిమినల్ కేసులు పెట్టి పక్రియ పూర్తిచేయాలి.
భారీ వర్షాలు కురిస్తే కూలిపోయే అవకాశం
గుర్తింపుపై దృష్టి సారించని టౌన్‌ప్లానింగ్ అధికారులు
భయాందోళనకు గురవుతున్న ప్రజలు
మహానగర వ్యాప్తంగా ఉన్న భవనాలు, వాటి స్థితిగతులు, వాటి జీవిత కాలం ఎన్నేళ్లు అనే అంశాలను టౌన్‌ప్లానింగ్ ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదు. నగరంలోని వరంగల్ చౌరస్తా, రామన్నపేట, గిర్మాజీపేట, పాతబస్తీలోని రంగశాయిపేట, కరీమాబాద్, ఎల్‌బీనగర్, ఎల్లంబజార్‌లో శిథిలావస్థకు చేరిన భవనాలు వందల సంఖ్యలో ఉన్నాయి. వర్షాలు ముమ్మరంగా కురిస్తే శిథిలావస్థకు చేరిన భవనాలు కూలిపోయి పలువురు ప్రమాదాలబారిన పడే అవకాశాలు ఉన్నాయి. నగరంలో శిథిలావస్థకు చేరిన భవనాలను గుర్తించి నోటీసులు జారీచేయాలని రాష్ట్ర పురపాలక ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ భవనాలపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించినా గ్రేటర్ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. టౌన్‌ప్లానింగ్ అధికారులు, సిబ్బంది శిథిలావస్థకు చేరిన భవనాలపై కళ్ళు తెరిచి గుర్తించి,ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత బల్దియా అధికారులపై ఉంది. ఈ విషయమై బల్దియా ఇన్‌చార్జ్ సీపీ రవీందర్ రాడేకర్‌ను వివరణ కోరగా.. శిథిలావస్థకు చేరిన భవనాలు నగరంలో లేవని చెప్పడం ప్రజల ప్రాణాలపై ఉన్న పట్టింపు ఏంటో అర్థమవుతోంది.


