హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో కొనసాగుతున్న శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా సోమవారం త్రయోదశి తిథిని అనుసరించి అమ్మవారికి మాత్రా, సర్వమంగళ క్రమాల్లో పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు ప్రత్యేక పూజలు చేశారు. మాత్రా అమ్మవారుగా బోగభేరాన్ని షోడశీక్రమంలో సర్వమంగళగా అలంకరించి చతుఃస్థానార్చన పూజలు, నీరాజన మంత్రపుష్పాలు, తీర్థ ప్రసాద వితరణ నిర్వహించారు. రేపు బుధవారం అమ్మవారిని మహాశాకంబరీగా అలంకరించనున్నారు. భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లను మట్టెవాడ సీఐ కరుణాకర్, పోలీస్ సిబ్బందితో కలిసి ఆలయ ఈఓ రామల సునీత పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్ సీనియర్ ఐఏఎస్ అధికారి సునీత దంపతులు, హనుమకొండ ఆర్డీఓ వెంకన్న, టూరిజం అధికారి శివాజీ, తహసీల్దార్ రవీందర్, శ్రీనివాస మంగాపురం చిత్రం హీరో గట్టమనేని జైకృష్ణ, దర్శకుడు అజయ్ భూపతి, చిత్రం యూనిట్ అమ్మవారికి దర్శించుకున్నారు.
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) బి.శేషాద్రి సోమవారం హనుమకొండ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ) అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌ని బి.శేషాద్రి మర్యాద పూర్వకంగా కలిసి మొక్క అందించారు. ఈసందర్భంగా కలెక్టర్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి సోమవారం వేతనాలు వారి ఖాతాల్లో జమయ్యాయి. వరుసగా మూడు నెలల నుంచి వేతనాలు రాకపోవడంతో సిబ్బంది పడుతున్న ఇబ్బందులపై ‘సాక్షి’ లో ఈ నెల 20న ‘వేతనాలు రాక వెతలు’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవడం వల్ల కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఒకేసారి మూడు నెలల వేతనాలు పడ్డాయి. దీంతో సిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతినెలా ఒకటో తేదీన వేతనాలు వచ్చేలా ఏర్పాట్లు చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
వరంగల్ స్పోర్ట్స్: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో హనుమకొండ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో కొనసాగుతున్న రీజనల్ స్పోర్ట్స్ హాస్టల్‌లో ప్రవేశాలకు సోమవారం ఎంపిక పోటీలు నిర్వహించారు. జేఎన్ స్టేడియంలో కొనసాగిన ఎంపికలకు వివిధ జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. రెండు రోజుల పాటు ఎంపికలు కొనసాగుతాయని హనుమకొండ డీవైఎస్‌ఓ కొత్త ప్రశాంత్ తెలిపారు. జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, రెజ్లింగ్, హ్యాండ్‌బాల్, స్విమ్మింగ్ క్రీడాంశాల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం ఈ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి సుమారు 250 మంది హాజరయ్యారని తెలిపారు. ఈ ఎంపికల ప్రక్రియను సాట్ అబ్జర్వర్లు సతీశ్‌రెడ్డి, జిమ్నాస్టిక్స్ కోచ్ దీపక్ ప్రసాద్, హ్యాండ్‌బాల్ కోచ్ సుధాకర్ యాదవ్, రెజ్లింగ్ కోచ్ సంతోశ్‌చారి పర్యవేక్షించారు. కా ర్యక్రమంలో క్రీడా సంఘాల రాష్ట్ర కార్యదర్శులు, డీఎస్‌ఏ కోచ్‌లు, సిబ్బంది పాల్గొన్నారు.


