శునకాలు వణకాలె! | - | Sakshi
Sakshi News home page

శునకాలు వణకాలె!

May 20 2026 10:31 AM | Updated on May 20 2026 10:31 AM

శునకాలు వణకాలె!

గ్రేటర్‌ వరంగల్‌లో వీధి కుక్కల లెక్క ఇదీ..

సాక్షిప్రతినిధి, వరంగల్‌:

గ్రేటర్‌ వరంగల్‌ నగరంలో వీధి కుక్కల (స్ట్రే డాగ్స్‌) సమస్య రోజురోజుకూ జఠిలమవుతోంది. జీడబ్ల్యూఎంసీ చేపడుతున్న నియంత్రణ చర్యలు ఏ మూలకూ సరిపోవడం లేదు. కుక్కల దాడుల ఘటనలతో ప్రజల్లో పెరుగుతున్న ఆందోళన నేపథ్యంలో వాటి తరలింపు అనివార్యమవుతోంది. ఈ నేపథ్యంలో పిల్లలు, వృద్ధుల భద్రత దృష్ట్యా వీధికుక్కలను గుర్తించి తరలించే ప్రక్రియ కొనసాగించవచ్చని, ప్రభుత్వాలు పర్యవేక్షించాలని అత్యున్నత న్యాయస్థానం మంగళవారం స్పష్టం చేసినట్లు అధికారులు తెలిపారు. జంతు సంరక్షణ నిబంధనలు పాటిస్తూ ప్రజల రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది. ఈనేపథ్యంలో గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలో ఇటీవల పెరిగిన కుక్కల దాడుల నేపథ్యంలో జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక బృందాలతో చర్యలు ముమ్మరం చేయనుంది. నగరవాసులు కూడా ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టి వీధికుక్కల బెడదను నివారించాలని కోరుతున్నారు.

నగరవాసులకు మరింత ఊరట

భారత జంతు సంక్షేమ బోర్డ్‌ (ఏడబ్ల్యూబీఐ) ఫ్రేమ్‌వర్క్‌ నిబంధనలను కచ్చితంగా దేశంలోని అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఉమ్మడి వరంగల్‌ వ్యాప్తంగా ప్రతీ జిల్లాకో పూర్తిస్థాయి జంతు జనన నియంత్రణ (ఏబీసీ) కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉంది. గ్రేటర్‌ వరంగల్‌లో అదనంగా మరొకటి, లేదా రెండు కేంద్రాలను ఏర్పాటు చేయడం అనివార్యం. జనాభాను దృష్టిలో ఉంచుకుని అవసరమైతే మరిన్ని ఏబీసీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కూడా కోర్టు సూచించింది. ఇదే జరిగితే వరంగల్‌ నగరవాసులకు మరింత ఊరట లభించనుంది. ఉమ్మడి వరంగల్‌ వ్యాప్తంగా ఉన్న 12 మున్సిపాలిటీల పాలకవర్గం సైతం వీధికుక్కల తరలింపుపై ప్రత్యేక శ్రద్ద వహించడం తప్పనిసరి కానుంది. అయితే షెల్టర్‌ జోన్‌ల ఏర్పాటు ఖర్చుతో కూడుకున్న పని కావడంతో బల్దియా అధికారులు ఏ విధంగా ముందుకెళ్తారో వేచి చూడాలి.

ఇటీవల జరిగిన కుక్క కాటు ఘటనలు..

● మార్చి నెలలో శివనగర్‌లోని నాలుగు జెండాల లేన్‌లో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. ఇద్దరు చిన్నారులపై దాడి చేసి గాయపర్చాయి.

● వరంగల్‌ 18వ డివిజన్‌లోని చెన్నారెడ్డి కాలనీలో ఐదుగురిపై దాడికి పాల్పడ్డాయి. దీంతో క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఎంజీఎం తరలించారు.

● కొద్ది నెలల క్రితం గ్రేటర్‌ వరంగల్‌ 31వ డివిజన్‌ న్యూశాయంపేట జేఎస్‌ఎం కాలనీ సమీపంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ ఐదేళ్ల బాలికపై వీధికుక్కలు దాడి చేసి గాయపర్చాయి.

● కాజీపేట బాపూజీనగర్‌లో ఇంటి ఎదుట ఆడుకుంటుండగా.. బాలుడు పడమటింటి హిమాన్షు సాయిని వీధి కుక్క దాడి చేసి గాయపర్చింది.

● భీమదేవరపల్లి మండలం రంగయ్యపల్లి గ్రామశివారులోని కాశకాలనీలో చిన్నారులు షేక్‌ సజ్జు, షేక్‌ హైమద్‌ ఇంటి ఎదుట ఆడుకుంటుండగా.. ఒక్కసారిగా కుక్కలు దాడిచేశాయి. ఈ ఘట నలో చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి.

‘బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కల సంచారం తీవ్ర ఆందోళనకరంగా మారింది. గౌరవప్రదమైన జీవన హక్కు అంటే కుక్కల దాడుల భయం లేకుండా స్వేచ్ఛగా జీవించే హక్కు కూడా. వీధి కుక్కల జనాభా నియంత్రణకు అవసరమైన మౌలిక సదుపాయాలను పటిష్టం చేయాలి. జనావాసాలనుంచి షెల్టర్‌జోన్‌లకు తరలించాలి..

– సుప్రీంకోర్టు

‘గ్రేటర్‌’ను వీడని

వీధికుక్కల భయం

రోజూ ఏదో ఒకచోట దాడి ఘటన..

కుక్కల భయం లేకుండా జీవించే హక్కు ప్రజలది : సుప్రీంకోర్టు

జీడబ్ల్యూఎంసీ స్పెషల్‌డ్రైవ్‌

చేపట్టాలంటున్న నగరవాసులు

మొత్తం వీధి కుక్కల సంఖ్య (సుమారు):

56,000 – 65,000

సగటున రోజుకు కుక్కకాట్లు: 20–25

సంవత్సరానికి రిపోర్ట్‌ అవుతున్న కేసులు:

6,200 – 8,000

స్టెరిలైజేషన్‌ (ఏడాదికి):

6,000–8,000 మాత్రమే

రోజుకు శస్త్రచికిత్స: 15–20 శునకాలు

ఒక్కోదానికి ‘కు.ని’ ఆపరేషన్‌ ఖర్చు:

రూ. 1,350

ఏడాదికి అవుతున్న ఖర్చు (సుమారు): రూ.60–70 లక్షలు

Advertisement
 
Advertisement
Advertisement