హన్మకొండ: విద్యుత్ ఉద్యోగుల బదిలీలు మరింత ఆలస్యం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం బదిలీలపై నిషేధం ఎత్తివేసింది. అన్ని ప్రభుత్వ శాఖలు మే నెలలో బదిలీ చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఈక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖలు బదిలీ ప్రక్రియలో నిమగ్నమయ్యాయి. అయితే విద్యుత్ శాఖలో మాత్రం బదిలీల అంశం ప్రస్తావనకు రావట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ సర్వీస్‌లు, లిఫ్ట్ ఇరిగేషన్, మిషన్ భగీరథ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై, సీవరేజ్ బోర్డు, మున్సిపల్ వాటర్ కనెక్షన్ విత్ సెపరేట్ డిస్ట్రిబ్యూషన్ సర్వీస్‌ల కోసం ప్రత్యేకంగా తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో నాలుగు విద్యుత్ సంస్థలు టీజీ జెన్‌కో, టీజీ ట్రాన్స్ కో, టీజీ ఎన్పీడీసీఎల్, టీజీ ఎస్‌పీడీసీఎల్ నుంచి రైతు డిస్కంకు ఉద్యోగుల పంపిణీ చేయాల్సి ఉంది. ఈక్రమంలో బదిలీలకు బ్రేక్ పడింది. రైతు డిస్కంకు ప్రస్తుత విద్యుత్ సంస్థల నుంచి అధికారులు, ఉద్యోగుల బదిలీ నియామకాల ప్రక్రియ పూర్తయితే ఖాళీలు, పోస్టులపై స్పష్టత రానుంది. ఈ క్రమంలో రైతు డిస్కంకు బదిలీ నియామకాల ప్రక్రియ పూర్తయ్యే వరకు విద్యుత్ శాఖలో బదిలీలు జరిగేలా లేవని విద్యుత్ వర్గాలు తెలిపాయి.
ఇప్పట్లో లేనట్లేనా?
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ ఎంఎస్ నెంబర్ 38, ప్రకారం ఈ నెల 31లోపు బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలి. విద్యుత్ సంస్థలను పరిశీలిస్తే ఇప్పట్లో బదిలీలు జరిగే అవకాశం లేట్లు కనిపిస్తోంది. బదిలీల అంశం ప్రస్తావనకు రావట్లేదు. ఇప్పుడు అందరి దృష్టి రైతు డిస్కంపైనే ఉంది. రైతు డిస్కంకు ఉద్యోగుల పంపిణీ ఎలా ఉంటుందనే ఆలోచనలో విద్యుత్ అధికారులు, ఉద్యోగులు పడ్డారు. రైతు డిస్కంకు వెళ్లే వారికి పదోన్నతి కల్పిస్తామని ప్రకటించడంతో పదోన్నతిపై ఆశలు పెట్టుకున్న అధికారులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆప్షన్ ఎంచుకున్నారు. ఆప్షన్ ఇవ్వడం, స్వీకరించడం వరకు ప్రక్రియ వేగంగా జరిగింది. అయితే బదిలీ నియామకాలు చేపట్టాల్సి ఉండగా.. యాజమాన్యాన్ని పలు సందేహాలు చుట్టుముట్టాయి. దీంతో ఎటూ తేల్చుకోలేక బదిలీ నియామకాలపై మళ్లగుళ్లాలు పడుతున్నారు. ప్రక్రియలో జాప్యం జరుగుతుండడంతో దీని ప్రభావం బదిలీలపై పడుతోంది.
ఆందోళనలు.. వాయిదా!
రాష్ట్రంలోని డిస్కంలలో జనవరిలో బదిలీలు చేయాలని యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు మెమో జారీ చేశాయి. జనవరి 23 నుంచి 31లోపు బదిలీ ప్రక్రియ ముగించాలని నిర్ణయం తీసుకున్నాయి. అయితే విద్యా సంవత్సరం మద్యలో బదిలీలు చేయొద్దని ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. విద్యుత్ ఉద్యోగులు జేఏసీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది. దీంతో బదిలీల ప్రక్రియ వాయిదా పడింది. విద్యా సంస్థలకు సెలవు దినాలైన మే నెలలో బదిలీలు జరుగాయని ఉద్యోగులు భావించారు. దీనికి తోడు ప్రభుత్వం కూడా బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక బదిలీల ప్రక్రియ సజావుగా సాగుతుందని ఆశించారు. ఆర్‌పీడీసీఎల్ రాకతో బదిలీల ప్రక్రియకు బ్రేక్ పడింది. ఆర్‌పీడీసీఎల్‌కు బదిలీ నియామకాల ప్రక్రియ ఎంత త్వరగా పూర్తయితే సాధారణ బదిలీల ప్రక్రియ అంత త్వరగా మొదలవుతుందని విద్యుత్ ఉద్యోగులు ఆశిస్తున్నారు. ఆర్పీడీసీఎల్ యాజమాన్యం త్వరగా బదిలీ నియామకాలు పూర్తి చేయాలని బదిలీని ఆశిస్తున్న ఉద్యోగులు కోరుతున్నారు.
ప్రతిబంధకంగా ఆర్పీడీసీఎల్
ఈ నెల 31తో ముగియనున్న గడువు
బదిలీ నియామకాలు పూర్తయితేనే రానున్న స్పష్టత
అప్పటి వరకు ట్రాన్స్‌ఫర్ల కోసం విద్యుత్ ఉద్యోగుల ఎదురు చూపులు


