‘బడి బాట’ను విస్తృతంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

‘బడి బాట’ను విస్తృతంగా నిర్వహించాలి

May 20 2026 10:31 AM | Updated on May 20 2026 10:31 AM

‘బడి బాట’ను విస్తృతంగా నిర్వహించాలి

హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

హన్మకొండ అర్బన్‌: జిల్లాలో బడిబాట కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును గణనీయంగా పెంచాలని హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఈ నెల 16 నుంచి జూన్‌ 19 వరకు నిర్వహిస్తున్న బడిబాట కార్యక్రమాల పురోగతిపై డీఈఓ ఎల్‌వీ.గిరిరాజ్‌ గౌడ్‌, ఎంఈఓలతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. బడిబాటలో అధికారులను, ప్రజాప్రతినిధులను, మహిళా స్వయం సహాయక సంఘాల ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలన్నారు. పాఠశాల భవనాలకు రంగులు వేయడం, పెండింగ్‌ పనులు పూర్తి చేయడం వంటి చర్యలను వేగవంతం చేయాలన్నారు. జనగణనను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో విద్యాశాఖ ప్లానింగ్‌ కోఆర్డినేటర్‌ మహేశ్‌, ఏఎంఓ డాక్టర్‌ మన్మోహన్‌, బడిబాట కార్యక్రమ కమ్యూనిటీ కో–ఆర్డినేటర్‌ సుమ, జీసీఈఓ సునీత, జిల్లాలోని 14 మండలాల ఎంఈఓలు, పలువురు ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

మేలు రకం విత్తనాలు విక్రయించాలి..

జిల్లాలో నాసిరకం విత్తనాల విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ తెలిపారు. రైతులకు మేలు రకం విత్తనాలు విక్రయించాలని డీలర్లకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో విత్తన కంపెనీల ప్రతినిధులు, డిస్ట్రిబ్యూటర్లు, డీలర్లతో విత్తన చట్టంపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీఏ ఆదిరెడ్డి విత్తన చట్ట నిబంధనలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఇందులో జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్‌ సింగ్‌, జిల్లా ఉద్యాన శాఖ అధికారి అనసూయ, జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి, జిల్లా మార్కెటింగ్‌ అధికారి అనురాధ, జిల్లా రవాణా శాఖ అధికారి వేణుగోపాల్‌, తెలంగాణ సీడ్స్‌ ఆర్‌ఎం శ్రీనివాస్‌, పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ శివకుమార్‌, వ్యవసాయ అధికారులు, విత్తన కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement