ఖిలా వరంగల్: వరంగల్ మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్ బొల్లం రమేశ్ ఆధ్వర్యంలో ఆదివారం రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సెంట్రల్‌జోన్ డీసీసీ ధార కవిత హాజరై వరంగల్ ఇన్‌చార్జ్ ఏసీపీ నర్సింహారావుతో కలిసి రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రౌడీషీటర్లు శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా ప్రవర్తించినా, అల్లర్లు, భూ తగాదాల్లో ఇతర గొడవల్లో తలదూరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు
చదువుతో పాటు
క్రీడల్లోనూ రాణించాలి
హసన్‌పర్తి : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యా వారోత్సవాలను పురస్కరించుకుని ‘విద్యా విజయోత్సవం’కార్యక్రమం ఆదివారం జిల్లా పరిషత్ పాఠశాలలో ఘనంగా ముగిసింది. కార్యక్రమానికి ఎంఈఓ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. క్రీడల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రశంస పత్రాలతో పాటు శాలువలతో సత్కరించారు. పీఈటీ శ్రీధర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పరపతి సంఘం నూతన అధ్యక్షుడిగా ‘పట్టాభి’
కాజీపేట : కాజీపేటలో ఆదివారం జిల్లా మున్నురు కాపు సంఘం 11వ సంఘం విస్తృత స్థాయి సమావేశం బాసాని నర్సింగరావు అధ్యక్షతన నిర్వహించారు. ప్రధాన కార్యదర్శి మిడిపెల్లి పట్టాభి సంఘం వార్షిక నివేదికను నివేదించారు. మున్నురు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు కనుకుంట్ల రవికుమార్, రిటైర్డ్ సభ్యులు సుంకరి వేణుగోపాల్, రవీందర్, నారయణరావులతో పాటు పాత కార్యవర్గ సభ్యులను ఘనంగా సన్మానించారు. సంఘం నూతన అధ్యక్షుడిగా పట్టాభి, ప్రధాన కార్యదర్శిగా నర్సింగరావు, కోశాధికారి సిరిపురి సత్యనారాయణలు ఎంపికయ్యారు. సంఘం నియమాలకు కట్టుబడి ఉంటామని సభ్యులు ప్రతిజ్ఞ చేశారు.


