హన్మకొండ అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నా రు. ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజాపాలన ప్రగతి ప్ర ణాళిక’ లో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రూ.200 కోట్లు కేటాయించి మౌలిక వసతులను మెరుగుపరిచినట్లు తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగాల్లోనూ నైపుణ్యాలు పెంపొందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పా ఠశాలలకు ధీటుగా ఫలితాలు సాధిస్తున్నాయని తె లిపారు. గతేడాది రాష్ట్ర స్థాయిలో 18వ స్థానంలో ఉ న్న జిల్లా ఉపాధ్యాయుల కృషి, కలెక్టర్ ప్రోత్సాహంతో 2026లో 9వ స్థానాన్ని సాధించిందని వెల్లడించారు. భవిష్యత్ తరాలకు మెరుగైన విద్య అందించాలనే లక్ష్యంతో విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నట్లు తెలిపారు. అనంతరం పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు గోసతి సిరిచందన, బొంతల సృజన, అనిశెట్టి రజితలను ఘనంగా సన్మానించారు. ప్రతి విద్యార్థికి రూ.10 వేల నగదు బహుమతిని అందించడంతో పాటు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి తన సొంత వేతనం నుంచి అదనంగా మరో రూ.10 వేల చొప్పున అందించారు. కార్యక్రమంలో డీఈఓ గిరిరాజ్, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి


