85వేల మొక్కల పెంపకం
ఎల్కతుర్తి : వాతావరణంలోని కాలుష్య నివారణ, సకాలంలో వర్షాలు కురిసేందుకు, పల్లెల్లో పచ్చదనం నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవానికి మండలంలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీలు సిద్ధమయ్యాయి. ఎల్కతుర్తి మండలంలో మొత్తం 20 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందుకు గాను అధికారులు, ప్రజాప్రతినిధులు 17 నర్సరీలను ఏర్పాటు చేశారు. మొత్తం 85 వేల మొక్కలు పెంచుతున్నట్లు అధికారులు తెలిపారు.
పలు రకాల మొక్కల పెంపకం..
శ్మశాన వాటికల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు కోసం మైదాకు మొక్కలు, అలాగే రోడ్డుకు ఇరువైపులా నాటేందుకు కానుగ, తంగేడు, వేప, ఈత, చింత, ర్యాల మొక్కలతో పాటు ఇంటి ఆవరణలో పెంచేందుకు గులాబీ, లిల్లి, బొప్పాయి, దానిమ్మ, మామిడి, సపోట మొక్కలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద మొక్కల పెంపకం చేపట్టారు. జనవరి, ఫిబ్రవరిలో చేపట్టిన మొక్కల పెంపకం ఇప్పటికే సిద్ధమయ్యాయి. రానున్న వర్షాకాలంలో మొక్కలు నాటేందుకు వీటిని సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం వేసవికాలం సందర్భంగా ఎండ నుంచి మొక్కలను రక్షించేందుకు అధికారులు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గ్రీన్ కలర్ షెడ్ నెట్లు ఏర్పాటు చేశారు. మొక్కలకు ప్రతీ రోజు సిబ్బందితో నీరందిస్తున్నారు. ఎప్పటికప్పుడు అధికారులు నర్సరీలను పర్యవేక్షిస్తూ సిబ్బందికి పలు సూచనలు చేస్తున్నారు. నర్సరీల్లోని మొక్కలు పలు చోట్ల నాటేందుకు సిద్ధమయ్యాయి. వర్షాలు కురిసిన వెంటనే రోడ్లకు ఇరువైపులా, ఖాళీ ప్రదేశాల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో, వసతి గృహాలు, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో, శ్మశాన వాటికల్లో మొక్కలు నాటనున్నారు.
20 జీపీల్లో 17 నర్సరీలు ఏర్పాటు


