● వివరాలు వెల్లడించిన సీఐ పులి రమేశ్
ఎల్కతుర్తి : తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఈనెల 14న మండల కేంద్రానికి చెందిన గొడిశాల విజయ్‌కుమార్ అనే గీత కార్మికుడిని దారుణంగా హత్య చేసిన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ పులి రమేశ్ తెలిపారు. ఈమేరకు ఆదివారం ఎల్క తుర్తి పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కమలాపూర్ మండలం కొత్తపల్లికి చెందిన అక్కెనపల్లి అఖిల్ తన భార్యతో విజయ్‌కుమార్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అనుమానంతో అతడిని ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ప్రణాళిక ప్రకారం ఈనెల 14న తన భార్య పిల్లలను తల్లిదండ్రుల వద్దకు పంపించాడు. అనంతరం కత్తి కొనుగోలు చేసి రోజుమాదిరిగానే ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ఎల్లమ్మ గుడి వద్ద ఉన్న కల్లు మండువా వద్దకు వెళ్లాడు. అక్కడ విజయ్‌కుమార్ వద్దే కల్లుతాగి అతనితో ఎప్పటిలాగే మంచిగా మాట్లాడాడు. ఈ క్రమంలో విజయ్‌కుమార్ ఆదమరిచి ఉండగా అదే అదునుగా భావించిన అఖిల్ కత్తితో అతని తల, కుడి చేయి, వీపు, ఛాతీపై నరికాడు. అనంతరం పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆదివారం మండల కేంద్రం శివారులోని సత్యసాయి గార్డెన్ వద్ద పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై నర్సింహారావు, సిబ్బంది ఉన్నారు.


