కమలాపూర్: ట్రాక్టర్ డ్రైవర్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన సంఘటన అంబాలలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అంబాలకు చెందిన మాదారపు సురేశ్ (40).. అదేగ్రామానికి చెందిన బోయిని శ్రీకాంత్ వద్ద ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సురేశ్ తన వృత్తిలో భాగంగా ఈ నెల 17న ఆదివారం ఉదయం డ్రైవర్ పనికోసం వెళ్లి రాత్రయినా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు అతడి ఆచూకీ కోసం వెతుకుతుండగా అంబాల అనుబంధ గ్రామం పెర్కపల్లి శివారులోని ఓ మామిడితోటలో ఆయన మృతదేహం కనిపించింది. ముక్కు నుంచి రక్తం కారుతూ ఎడమ కాలు విరిగిపోయి ఉంది. మృతుడి భార్య మాదారపు సుమలత ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ నవీన్ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. కాగా, పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులు, బంధువులు సురేశ్ మృతదేహంతో సోమవారం అంబాలలోని ట్రాక్టర్ యజమాని శ్రీకాంత్ ఇంటి ఎదుట సుమారు గంటపాటు ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న ఇన్‌స్పెక్టర్ నవీన్ సిబ్బందితో అక్కడకు చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులను నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.
సీపీఎం ఆందోళన
కాజీపేట : కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చే స్తూ కాజీపేట మున్సిపల్ సర్కిల్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. సీపీఎం మండల కార్యదర్శి ఓరుగంటి సాంబయ్య ఆధ్వర్యంలో సోమవారం కార్యకర్తలు ప్రధాని మోదీ దిష్టిబొమ్మతో పుర వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో కొ ద్దిసేపు రహదారిపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. అనంతరం పిఎం మోదీ దిష్టిబొమ్మను కార్యకర్తలు దహనం చేశారు. ఉపేందర్, మల్లేశం, రమేష్, రవి, రామస్వామి, రాజేందర్, ప్రదీప్ పాల్గొన్నారు.


