దామెర : మండలంలోని తక్కళ్లపహాడ్ కళాకారులకు పుట్టినిల్లు వంటిదని ప్రముఖ సినీగేయ రచయిత వరంగల్ శ్రీనివాస్ అన్నారు. ఇటీవల నిర్వహించిన కాకాతీయ కళల జాతర కార్యక్రమంలో భాగంగా గ్రామానికి చెందిన రాజబోయిన సంధ్యారాణి, దాడి సారక్క, దాడి ఐలక్క, రజిత, కేతనబోయిన శైలజ, దాడి అరుణ జానపద బృందగానం విభాగంలో పాల్గొన్నారు. కాగా వారు మొదటి బహుమతి సాధించి 20వేల నగదు, జ్ఙాపికలు అందుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సోమవారం స్థానిక గ్రామపంచాయతీలో సన్మాన సభ నిర్వహించారు. బృందానికి నాయకత్వం వహించిన కె.ప్రవీణ్‌తో పాటు బృంద సభ్యులను శాలువాతో ఘనంగా సన్మానించి అభినందించారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ.. సంప్రదాయమైన జానపదాలు ఆలపించడంలో తక్కళ్లపహాడ్ కళాకారుల ప్రతిభకు నిదర్శనమని అన్నారు. సంధ్యారాణి బృందం మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సర్పంచ్ దాడి వసంతరమేశ్, ఉప సర్పంచ్ బండారి ప్రభాకర్, వార్డు సభ్యులు గుడిసే కొమురమ్మ, గోగ్గుర ప్రసాద్ కొత్తపల్లి మల్లేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


