ఇంటినుంచి బయలుదేరిన పది నిమిషాల్లోనే తండ్రీకొడుకులు మృత్యుఒడికి..
రఘునాథపల్లి: ఎండ ముదరక ముందే పొలం వద్దకు వెళ్లి పత్తి కట్టె తొలగించి వస్తానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన తండ్రీకొడుకులు పది నిమిషాల్లోనే మృత్యుఒడికి చేరారు. రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ ఘటన సోమవారం జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని కోమళ్ల–గోవర్ధనగిరి గ్రామాల మధ్య జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఎస్సై నరేశ్ కథనం ప్రకారం.. కోమళ్ల గ్రామానికి చెందిన అలావత్ బాలాజీ(46)కి గోవర్ధనగిరి సమీపంలో రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఖరీఫ్‌లో వ్యవసాయ పనులు ప్రారంభించేందుకు పత్తి కట్టెను తొలగించేందుకు ఇంటి నుంచి బయలుదేరుతున్నాడు. ఈ సమయంలో సెలవులు ఉండడంతో ఇంట్లోనే ఉన్న కుమారుడు నరేశ్ (23) తాను కూడా వస్తానని చెప్పడంతో ఇద్దరు కలిసి బైక్‌పై వ్యవసాయ భూమి వద్దకు వెళ్తున్నాడు. తండ్రి వాహనం నడుపుతుండగా కుమారుడు వెనుక కూర్చున్నాడు. ఈ క్రమంలో జనగామ నుంచి కుర్చపల్లికి న్యూ హోల్యాండ్ షోరూంకు చెందిన ట్రాక్టర్ డెమో నిర్వహించడానికి వెళ్తూ వెనుక నుంచి బైక్‌ను ఢీకొంది. దీంతో వాహనం నడుపుతున్న బాలాజీ అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన నరేశ్‌ను వరంగల్ ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య జ్యోతి, కుమార్తె శిరీష ఉన్నారు. భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.
బీటెక్ ఫైనలియర్ పరీక్షలు రాసిన నరేశ్..
నరేశ్ ఇటీవల యశ్వంతాపూర్‌లోని క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనలియిర్ పరీక్షలు రాశాడు. సెలవులు కావడంతో ఇంటి వద్దే ఉంటున్నాడు. ఉదయం తండ్రి ఒక్కడే పొలం వద్దకు వెళ్తుండగా తాను వస్తానని చెప్పాడు. అయితే ఎండలో ఎందుకని తల్లిదండ్రులు వద్దన్నా వినలేదు. ఇంట్లో ఖాళీగా ఎందుకుండాలి.. నాన్న ఒక్కడే కష్టపడడం ఎందుకంటూ తండ్రితో కలిసి వెళ్లాడు. అమ్మా, చెల్లి నేను నాన్నకు తోడుగా ఉన్నా. తొందరగనే వస్తామంటూ వెళ్లిన 10 నిమిషాలకే మృతి చెందిన సమాచారం తెలియడంతో భార్య జ్యోతి, కుమార్తె శిరీష గుండెలవిసేలా రోదించారు.
కారు.. బైక్‌ను ఢీకొన్న ఘటనలో దంపతులు
నర్సంపేట రూరల్ : కారు.. బైక్‌ను ఢీకొన్న ప్రమాదంలో దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన సోమవారం రాత్రి నర్సంపేట పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని పాల్తియా తండాకు చెందిన బోడ రమేశ్ (35), పూలమ్మ (30) దంపతులు పని నిమిత్తం బైక్‌పై నర్సంపేట మీదుగా వరంగల్ వైపునకు వెళ్తున్నారు. ఈక్రమంలో నర్సంపేట పట్టణంలోని సర్వాపురం గ్రామ శివారులో నర్సంపేట – మహబూబాబాద్ 365 జాతీయ రహదారిపై కారు వెనుక నుంచి బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై అరుణ్ ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా, మృతులకు కూతురు, కుమారుడు ఉన్నారు. రమేశ్, పూలమ్మ దంపతుల మృతితో పాల్తియాతండాలో విషాదం నెలకొంది.
రమేశ్, పూలమ్మ
మృతదేహాలు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలుచోట్ల రహదారులు రక్తసిక్తమయ్యాయి. సోమవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని కోమళ్ల–గోవర్ధనగిరి గ్రామాల మధ్య జాతీయ రహదారిపై ట్రాక్టర్.. బైక్‌ను ఢీకొన్న ప్రమాదంలో తండ్రీకొడుకులు, నర్సంపేట పట్టణంలోని 365 జాతీయ రహదారిపై కారు.. బైక్‌ను ఢీకొన్న ప్రమాదంలో దంపతులు చనిపోయారు. దీంతో ఆయా కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది.


