ధర్మసాగర్: రాజకీయ ఉనికి కోసమే కొందరు విమర్శలు చేస్తున్నారని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. మండలంలోని ముప్పారం, నారాయణగిరి గ్రామాల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి సోమవారం పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి, లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ నారాయణగిరి, ముప్పారం గ్రామాలకు రూ.3 కో ట్ల చొప్పున అభివృద్ధి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాటలు వేసిందని, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ చట్టంతోనే మహిళలు పాలనలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నా యకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందన్నారు. అసెంబ్లీలో కడియం శ్రీహరిని నిజాయితీ గల నాయకుడిగా సీఎం అభివర్ణించడం గర్వకారణమన్నారు. ఎమ్మెల్యే కృషితో నియోజకవర్గ అభివృద్ధికి రూ.1,400 కోట్లు నిధులు అందించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ నియోజక వర్గంలో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో ఒక విప్లవాత్మకమైన ప్రయత్నం చేస్తామని, రెండో విడతలో అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో అవి నీతికి ఆస్కారం ఉండదని తేల్చిచెప్పారు. 32 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎవరి దగ్గర ఒక్క రూపాయి తీసుకోలేదని అన్నారు. తన వారసురాలిగా వరంగల్ ఎంపీ కడియం కావ్య కూడా నిజాయితీగా పనిచేస్తున్నారన్నారు. నారాయణగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తెలంగాణ మాడల్ స్కూల్‌గా అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఆయా కార్యక్రమాల్లో నారాయణగిరి సర్పంచ్ పుట్ట రేణు క, ముప్పారం సర్పంచ్ గుంటిపల్లి రేణుక, హౌసింగ్ పీడీ సిద్ధార్థనాయక్, పీఆర్ ఈఈ సైదులురెడ్డి, పీఆర్ డీఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ ఎంపీ కడియం కావ్య


