హన్మకొండ: టీజీ ఎప్‌సెట్ ఫలితాల్లో హనుమకొండలోని షైన్ విద్యాసంస్థల విద్యార్థులు విజయభేరి మోగించారు. తమ కళాశాలకు చెందిన విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారని షైన్ విద్యా సంస్థల చైర్మన్ మూగల కుమార్‌యాదవ్ తెలిపారు. రాష్ట్రస్థాయిలో 2,193, 2,772 ర్యాంకులతో కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ఫలితాలు సాధించినట్లు వివరించారు. రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించడం సంతోషంగా ఉందన్నారు. అగ్రికల్చల్ కేటగిరీలో సీహెచ్.అజిత్ రెడ్డి 2,193వ ర్యాంక్, టి.హాసిని 2,772వ ర్యాంకు సాధించారని, ఇంజనీరింగ్‌లో ఎం.ప్రశాంతి 3,544, ఎం.దీక్షిత్ 3,969, జి.సిద్ధు 4,143, సీహెచ్.రూపశ్రీలక్ష్మి 5,433, ఆర్.సౌరభ్‌వర్మ 5,529వ ర్యాంకు సాధించారని వివరించారు. అగ్రికల్చర్ కేటగిరీలో 23 మంది విద్యార్థులు 20 వేల లోపు ర్యాంకులు, ఇంజనీరింగ్ కేటగిరీలో 31 మంది 20 వేల లోపు ర్యాంకులు సాధించారని తెలిపారు. అనుభవజ్ఞులైన ఆధ్యాపకులతో నిరంతర పర్యవేక్షణ, మోటివేషన్‌తో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు. ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవడంతోనే ఈ విజయాలు సాధించారని కుమార్‌యాదవ్ చెప్పారు. ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులను, ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులను అభినందించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు మూగల రమ, ఆరూరి కవిత, ఐఐటీ కోఆర్డినేటర్ మూగల రమేశ్ యాదవ్, ప్రిన్సిపాళ్లు మారబోయిన రాజుగౌడ్, పి.శ్రీనివాస్, జి.ప్రశాంత్ పాల్గొన్నారు.
ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి
విద్యారణ్యపురి: దివ్యాంగ విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని హనుమకొండ డీఈఓ ఎల్వీ గిరిరాజ్‌గౌడ్ సూచించారు. హనుమకొండ సుబేదారిలోని ఉన్నత పాఠశాలలో ప్రత్యేక అవసరాల పిల్లలకు సోమవారం వివిధ ఉపకరణాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆత్మవిశ్వాసంతో వైకల్యాన్ని కూడా జయించవచ్చన్నారు. జిల్లా సమ్మిళిత విద్య కోఆర్డినేటర్ ఇ.సుమాదేవి మాట్లాడుతూ భవిత కేంద్రాలకు వచ్చే ప్రత్యేక అవసరాల పిల్లలకు రవాణా చార్జీలు, ఇతర పాఠశాలలకు వచ్చేవారికి ఎస్కార్ట్ అలవెన్స్, కంటి చూపు తక్కువగా ఉన్న విద్యార్థులకు రీడర్ అలవెన్స్ వంటి సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. కార్యక్రమంలో 153 మందికి ఉపకరణాలు పంపిణీ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా ప్లానింగ్ కోఆ ర్డినేటర్ బి.మహేశ్, జిల్లా అకడమిక్ మానిటరింగ్ కోఆర్డినేటర్ మన్‌మోహన్, హనుమకొండ ఎంఈఓ నెహ్రూ, జీసీడీఓ సునీత, అలీంకో ప్రతినిధి రాకేశ్, ఐఈఆర్‌పీలు, దివ్యాంగ విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


