న్యూస్‌రీల్
ఈ చిత్రంలో కట్టెల పొయ్యిపై మిర్చీ బజ్జీలు కాలుస్తున్న మహిళ పేరు తేజావత్ మంగమ్మ. హనుమకొండలో ఈమె బజ్జీల బండి పెట్టుకుని కుటుంబాన్ని పోషిస్తోంది. ఇదివరకు తక్కువ ధరలో గ్యాస్ తీసుకుని వ్యాపారం సాగించేది. యుద్ధం నేపథ్యంలో గ్యాస్ దొరక్కపోవడం, ఒక్కసారిగా గ్యాస్ ధర పెరగడంతో కట్టెలపొయ్యి వాడకం తప్పనిసరైందని ఆమె చెప్పింది.
హన్మకొండఅర్బన్: కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను భారీగా పెంచడంతో వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గృహ వినియోగ గ్యాస్ కొరతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇది మరింత భారంగా మారే పరిస్థితి నెలకొంది. ఇంత వరకు రూ.2,350గా ఉన్న కమర్షియల్ గ్యాస్ సిలిండర్, ప్రస్తుతం రూ.1,000 పెరగడంతో రూ.3,350కి పెరిగింది. దీంతో వ్యాపారులను తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టినట్లయ్యింది. యుద్ధ ప్రభావం కారణంగా గ్యాస్ సరఫరాలో అంతరాయం, ధరల పెంపు ‘పిడుగుపాటు’గా మారిందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వీధివ్యాపారులు కుదేలు
గ్యాస్‌పై ఆధారపడి చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నవారు ధర పెంచడంతో కుదేలయ్యే పరిస్థితి ఏర్పడింది. హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, కట్లెట్ బండ్లు, టీ స్టాల్స్, ఇడ్లీ బండ్లు ఇతర వీధి వ్యాపారులకు ఇది భారంగా మారింది. వ్యాపారాలు నడపడం కష్టమవుతోందని పలువురు చెబుతున్నారు. గతంలోనూ ఇంత మొత్తంలో ఒక్కసారిగా ధరలు పెంచిన సందర్భాలు లేవని, కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని వారు కోరుతున్నారు.
గృహ వినియోగంపై దెబ్బ
కమర్షియల్ సిలిండర్ ధరల పెంపు ప్రభావం గృహ వినియోగంపైనా పడే అవకాశం ఉందని పలువురు వాపోతున్నారు. ఇప్పటికే విచ్చలవిడిగా అక్రమ రీఫిల్లింగ్ కేంద్రాలు ఏర్పడిన నేపథ్యంలో, గృహ వినియోగ సిలిండర్లను దొడ్డి మార్గంలో కమర్షియల్ అవసరాలకు మళ్లించే ప్రమాదం ఉంది. దీంతో కృత్రిమ కొరత ఏర్పడే అవకాశం ఉంది.
అక్రమాలకు అడ్డుకట్ట ఏది?
గ్రేటర్ వరంగల్‌లో గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ దందా విచ్చలవిడిగా సాగుతున్నప్పటికీ పౌరసరఫరాల శాఖ పర్యవేక్షణపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గృహ వినియోగ సిలిండర్ అధికారికంగా ధర రూ.984గా ఉండగా, బ్లాక్ మార్కెట్‌లో రూ.1,800 నుంచి రూ.2,000 వరకు విక్రయిస్తున్నారు. కమర్షియల్ సిలిండర్ ధరలు పెరగడంతో, గృహ వినియోగ సిలిండర్లను అక్రమంగా వినియోగించే అవకాశం మరింత పెరిగే అవకాశం ఉంది. అప్పుడప్పుడూ కేసులు నమోదు చేస్తున్నప్పటికీ, కఠిన చర్యలు తీసుకోవడంలో అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
హనుమకొండ జిల్లాలో గ్యాస్ గణాంకాలు ఇలా..
గ్యాస్ ధర పెంచడంతో వ్యాపారుల విలవిల
కమర్షియల్ గ్యాస్ ధర ఇదివరకు 2,350 రూ.1,000 పెంపుతో 3,350
హోటల్ నిర్వాహకులు రేట్లు పెంచే అవకాశం
గృహ వినియోగంపైనా ప్రభావం
కమర్షియల్ సిలిండర్లు:
2,622
గృహ వినియోగ సిలిండర్లు:
4,15,359
గ్యాస్ ఏజెన్సీలు: 18
వరంగల్ జిల్లాలో..
గ్యాస్ ఏజెన్సీలు : 16
డొమెస్టిక్ కనెక్షన్లు :
3,15,056
కమర్షియల్ కనెక్షన్లు :
1,452


