హన్మకొండ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా శనివారం జిల్లాలో నియోజకవర్గ స్థాయి సమావేశాలను ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్లు హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌నుంచి రాష్ట్ర వ్యవసాయ, సహకారశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు.. ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక అమలు, నీట్, ధాన్యం సేకరణ, డివిజనల్ స్థాయిలో ప్రజావాణి నిర్వహణ అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్షించారు.
నియోజకవర్గ సభలు ఉదయమే..
వీసీ అనంతరం కలెక్టర్ చాహత్ బాయ్‌పాయ్ జిల్లా అధికారులతో సమావేశమై కీలక సూచనలు చేశారు. వేసవి తీవ్రత దృష్ట్యా ఉదయం వేళలోనే సభలు నిర్వహించాలని సూచించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ సభ హనుమకొండ కలెక్టరేట్‌లో, పరకాల సభ అక్కడి మహాదేవ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సభలకు హాజరయ్యే ప్రజలకు తాగునీరు, కూర్చునే సదుపాయం, అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 4 నుంచి 9 వరకు రైతు వారోత్సవాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ సక్రమంగా సాగేందుకు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమాన్ని రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రతీ సోమవారం పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఆదివారం జరగనున్న నీట్ ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ నెల 10వ తేదీ వరకు నిర్వహించే స్వీయ గణన కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రవి, జిల్లా రెవెన్యూ అధికారి సత్యపాల్ రెడ్డి, జెడ్పీ సీఈఓ శేషాద్రి, డీఆర్డీఓ మేన శ్రీను, డీసీఓ సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హైవేలు, ఆర్‌ఓబీల పనులపై సమీక్ష
నయీంనగర్: హనుమకొండ ‘కుడా’ కార్యాలయంలో జాతీయ రహదారులు, రైల్వే, ఆర్‌అండ్‌బీ, ‘కుడా’ అధికారులతో జిల్లాలోని జాతీయ రహదారులు, ఆర్‌ఓబీల పనులపై కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కరుణాపురం వద్ద ఉన్న ఆర్‌ఓబీ, బావుపేట, కోమటిపల్లి ఆర్‌ఓబీల పెండింగ్ అనుమతులపై సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడారు. కరుణాపురం ఆర్‌ఓబీ అలైన్‌మెంట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. సమావేశంలో జాతీయ రహదారుల శాఖ మేనేజర్ లింగయ్య, సికింద్రాబాద్ రైల్వే డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ కౌశల్ పాండే, అధికారి దేవరాజ్, ఆర్‌అండ్‌బీ ఈఈ సురేశ్ బాబు, ‘కుడా’ సీపీఓ అజిత్ రెడ్డి, భూ సేకరణ విభాగం సూపరింటెండెంట్ జగత్ సింగ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
నియోజకవర్గ స్థాయిలో
నేడు సమావేశాలు
హనుమకొండ కలెక్టర్
చాహత్ బాజ్‌పాయ్


