డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి
కాళోజీ సెంటర్: ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి డిమాండ్ చేశారు. హనుమకొండలోని లష్కర్‌బజార్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన డీటీఎఫ్ వరంగల్ జిల్లా శాఖ ఐదో వార్షిక కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. బడ్జెట్ కేటాయించకుండా విద్యారంగంలో మార్పులు తీసుకురావడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన విద్యాకమిషన్ నివేదిక ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసేలా లేదని, ప్రైవేట్ విద్య సంస్థలను పెంచి పోషించేలా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు విషయంలో స్పష్టత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర కార్యదర్శి ఎ.శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చావ బాబు మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 5న జిల్లా కేంద్రాల్లో నిర్వహించే దీక్షలను జయప్రదం చేయాలని కోరారు. డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె.యాకయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో అధ్యాపక జ్వాల ప్రధాన సంపాదకుడు డాక్టర్ ఎం. గంగాధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.గోవిందరావు, జిల్లా నాయకులు డి.మహేందర్‌రెడ్డి, ఎస్.సుధారాణి పాల్గొన్నారు.


