యువత అవకాశాలు అందిపుచ్చుకోవాలి
కేయూ క్యాంపస్: సముద్రాంతర్భాగం నుంచి ఆకాశం వరకు అనేక అవకాశాలున్నాయని, విద్యార్థులు, యువత అందిపుచ్చుకోవాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి కోరారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో సోమవారం కేయూ ఆడిటోరియంలో రెండురోజులపాటు జరిగే రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల విద్యార్థుల సమ్మేళనం ప్రారంభ సభలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రపంచంలోనే అత్యధిక యువత కలిగిన దేశం ఇండియా అన్నారు. ప్రపంచ అవసరాల దృష్ట్యా మన విద్యావ్యవస్థ ఉండాలన్నారు. ప్రస్తుతం 80లక్షల మంది విద్యార్థులకు లక్షమంది అధ్యాపకులు ఉన్నారన్నారు. పదేళ్లుగా యూనివర్సిటీల్లో నియామకాలు లేవనే విషయం వాస్తవమని, ప్రతీ విద్యార్థి, సంస్థలు కూడా నవీకరణ చెందాలన్నారు. రాబోయే కాలంలో దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో సుమారు 20 లక్షల కోట్ల ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయని, వాటిని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రపంచ గతిని మార్చేశక్తి భారతీయ యువతపై ఉందన్నారు.
విప్లవాత్మక మార్పులను గమనిస్తూ
తీర్చిదిద్దుకోవాలి..
దేశంలో విద్యావ్యవస్థలో వస్తున్న విప్లవాత్మక మార్పులను గమనిస్తూ విద్యార్థులు తమ భవిష్యత్‌ను తీర్చిదిద్దుకోవాలని కేయూ వీసీ కె.ప్రతాప్‌రెడ్డి కోరారు. యూనివర్సిటీలు సాంకేతిక పరిజ్ఞానం కలిగిన సంస్థలతోపాటు ఇండస్ట్రీయల్ కంపెనీలతో ఎంఓయూలతో ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తాయన్నారు.
జాతీయ విద్యావిధానం విద్యార్థులకు వరం..
విద్యారంగాన్ని ప్రక్షాళన చేయాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో చేపట్టిన దీర్ఘకాలిక పోరాటాల ఫలితమే జాతీయ విద్యావిధానమని, ఇది నేడు దేశంలోని విద్యార్థులకు వరమని ఏబీవీపీ క్షేత్ర సంఘటన మంత్రి చిరిగే శివకుమార్ అన్నారు. ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు జానారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు, యూనివర్సిటీల హాస్టళ్ల కన్వీనర్ జీవన్, సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్ నీతుసింగ్, కేయూ అధ్యక్షుడు హరికృష్ణ, ఏబీవీపీ తెలంగాణ ప్రాంత ప్రముఖ్ మాసాడిబాబురావు మాట్లాడారు. కేయూ ఇన్‌చార్జ్ నిమ్మల రాజేశ్, కార్యదర్శి జ్ఞానేశ్వర్, విద్యార్థులు పాల్గొన్నారు.
బాలకిష్టారెడ్డి దృష్టికి వర్సిటీల్లోని సమస్యలు
రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి దృష్టికి వివిధ యూనివర్సిటీల విద్యార్థులు పలు సమస్యలు తీసుకెళ్లారు. హైదరాబాద్‌లోని కోఠి మహిళా యూనివర్సిటీలో అనేక సమస్యలున్నాయని, పరిష్కరించాలని ఆ యూనివర్సిటీ నేత సుమ, అలాగే, ప్రతీ యూనివర్సిటీలోనూ స్కిల్‌డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఓయూ విద్యార్థి రాజు, పాలమూరు, తెలంగాణ యూనివర్సిటీలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఆయా యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలను బాలకిష్టారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయా సమస్యలు పరిష్కరించేలా తమవంతు కృషిచేస్తున్నామని బాలకిష్టారెడ్డి ఈసందర్భంగా తెలిపారు.
రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్
బాలకిష్టారెడ్డి
కేయూలో వర్సిటీల విద్యార్థుల
సమ్మేళనం


