రైల్వే గ్రీవెన్స్‌కు 164 అర్జీలు
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే కమ్యూనిటీ హాల్‌లో గురువారం నిర్వహించిన గ్రీవెన్స్ క్యాంప్‌ను రైల్వే కార్మికులు, రిటైర్డ్ కార్మికులు వినియోగించుకున్నారు. సికింద్రాబాద్ డివిజన్ పర్సనల్ ఆఫీసర్ జీఆర్ సుధీర్‌కుమార్ ఆదేశాల మేరకు కాజీపేట వెల్ఫేర్ ఇన్‌స్పెక్టర్ సీవీవీ రెడ్డి సమక్షంలో రైల్వే జనరల్ ఇన్‌స్టిట్యూట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్యాంపును కాజీపేట రైల్వే డీఎంఈ ఖాడె అనికేత్ తాత్యసాహెబ్ ప్రారంభించారు. క్యాంపులో 164 మంది రైల్వే కార్మికులు, రిటైర్డ్ రైల్వే కార్మికులు వినతి పత్రాలు అందించారు. ఐడీ కార్డ్స్, ఉమిద్ కార్డ్స్ అక్కడిక్కడే పొందారు. కొన్ని దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలున్నవారు సికింద్రాబాద్ డివిజన్ పర్సనల్ కార్యాలయానికి తీసుకెళ్లి పరిష్కరించనున్నట్లు వెల్ఫేర్ ఇన్‌స్పెక్టర్ సీవీవీ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో వెల్ఫేర్ ఇన్‌స్పెక్టర్ గణేశ్‌కుమార్, కె.చంద్రశేఖర్, చీఫ్ ఓఎస్, ఓఎస్‌లు కె.శ్రీధర్, ఎస్.వేలు, సత్యనారాయణ, కృష్ణ, జూనియర్ క్లర్క్ వికాస్‌కుమార్, నాగార్జున, నిర్వాహకులు ఇన్‌స్టిట్యూట్ కమిటీ సెక్రటరీ దేవులపల్లి రాఘవేందర్, జాయింట్ సెక్రటరీ ఎం.రాజయ్య, ట్రెజరర్ జి.రాజేశ్వర్‌రావు, స్టాఫ్ పాల్గొన్నారు.
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలోని 16 పీఎంశ్రీ హైస్కూల్ విద్యార్థులకు నేటి (శుక్రవారం) నుంచి రెండు రోజులపాటు జిల్లా స్థాయి ఫుట్‌బాల్, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్–100 మీటర్ల రన్నింగ్, లాంగ్‌జంప్, షాట్‌పుట్ తదితర క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ఫుట్‌బాల్ పోటీలు కాజీపేటలోని సేయింట్ గాబ్రియల్ స్కూల్‌లో, మిగతా పోటీలు జేఎన్‌ఎస్‌లో జరగనున్నా యి. పోటీలకు 79మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు జిల్లా ఇన్‌చార్జ్ విద్యాశాఖాధికారి ఎ.వెంకట్‌రెడ్డి గురువారం తెలిపారు. మరిన్ని వివరాలకు విద్యాశాఖ సమగ్ర శిక్ష ప్లానింగ్ కో–ఆర్డినేటర్ బి.మహేశ్, జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్ మన్మోహన్‌ను హెచ్‌ఎంలు సంప్రదించాలని సూచించారు.
రేపు దివ్యాంగుల క్రీడోత్సవాలు
కాజీపేట అర్బన్ : అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా హనుమకొండ జేఎన్‌ఎస్‌లో ఈనెల 29న జిల్లా స్థాయి వికలాంగుల క్రీడోత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమాధికారి జయంతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రన్నింగ్ రేస్, షాట్‌పుట్, జావెలిన్ త్రో, క్యారమ్స్, చెస్ పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తి గల వికలాంగులు వయస్సు, వైకల్య ధ్రువీకరణ పత్రంతీసుకురావాలని సూచించారు.
ఎంజీఎం : ఎంజీఎం ఆస్పత్రిలో కిందిస్థాయి సిబ్బంది అవినీతి రోజురోజుకూ పెరిగిపోతున్న క్రమంలో సరైన ఆధారాలతో పరిపాలనాధికారులను సంప్రదిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఎంజీఎంలో 300 ఓసీఎస్ పద్దులో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి జె.శ్రీనివాస్ రోగులను డబ్బులు అడుగుతున్న దృశ్యాలను చికిత్స కోసం వచ్చిన రో గి బంధువైన ఓ మహిళ చిత్రీకరించి ఆస్పత్రి సూపరింటెండెంట్ హరిశ్చంద్రారెడ్డికి అందించింది. అంతేకాకుండా మరో ఎంఎన్‌ఓ సైతం డబ్బులడుగుతున్న ఘటనను కూడా చిత్రీకరించింది. ఈఘటనలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి శ్రీనివాస్‌ను విధుల్లోంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీచేసినట్లు సూపరింటెండెంట్ తెలిపారు. ఎంఎన్‌ఓ డబ్బులడిగిన ఘటనపై త్రిసభ్య కమిటీ విచారణ చేస్తోందన్నారు.
హసన్‌పర్తి: శాశ్వత కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించడంలో పురుషులు ముందుండాలని డీఎంహెచ్‌ఓ అప్పయ్య సూచించారు. హసన్‌పర్తిలోని ఉన్నత శ్రేణి ఆస్పత్రిలో గురువారం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ శిబిరం నిర్వహించగా అప్పయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతుల గురించి అవగాహన కల్పించారు. ఈసందర్భంగా 21 మంది పురుషులకు కుట్టు లేని ఆపరేషన్ చేశారు. కార్యక్రమాన్ని పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మాతా శిశు సంక్షేమ ప్రోగ్రాం అధికారి మంజుల డాక్టర్ కృతికారెడ్డి, డాక్టర్ సురేశ్, స్టాటిస్టికల్ అధికారి ప్రసన్నకుమార్, కమ్యూనిటీ ఆఫీసర్ మాధవరెడ్డి, హెల్త్ అసిస్టెంట్ సంతోశ్ ఉన్నారు.


