ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించుకుందాం
వరంగల్ క్రైం: గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ ఆదేశించారు. నెలవారీ నేర సమీక్షలో భాగంగా.. వరంగల్ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో గురువారం కమిషనరేట్‌లో నేర సమీక్ష నిర్వహించారు. మూడు విడతలుగా నిర్వహించనున్న పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై పోలీస్‌స్టేషన్ల వారీగా సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, గ్రామాల వివరాల్ని పోలీస్ కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతీ పోలీస్ అధికారి ప్రణాళికాబద్ధంగా పనిచేయాలన్నారు. ఎన్నికల వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, నామినేషన్ మొదలుకుని ఎన్నికలు ముగిసే వరకు పోలీస్ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
రౌడీషీటర్లను బైండోవర్ చేయండి..
సరైన రీతిలో బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలని, గతంలో ఎన్నికల సమయంలో నేరాలకు పాల్పడిన నేరస్తులు, రౌడీషీటర్లు, అనుమానితులను బైండోవర్ చేయాలని ఆదేశించారు. ఎన్నికలు జరిగే గ్రామాలను పోలీస్ అధికారులు నిరంతరం సందర్శిస్తూ సజావుగా కొనసాగేందుకుగా స్థానికులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. అందుబాటులో ఉన్న పోలీస్ సిబ్బందిని వినియోగించుకుని అధికారులు ఎన్నికల బందోబస్తు నిర్వహించుకోవాలని సూచించారు. అనంతరం పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టులు, నేరాల నియంత్రణ కోసం తీసుకుంటున్న చర్యలు మొదలైన అంశాలపై పోలీస్ కమిషనర్ అధికారులతో సమీక్ష జరిపారు. సమావేశంలో డీసీపీలు అంకిత్ కుమార్, రాజమహేంద్రనాయక్, కవిత, ఏఎస్పీలు శుభం, చైతన్య, అదనపు డీసీపీలు రవి, ప్రభాకర్, బాలస్వామి, సురేశ్‌కుమార్, శ్రీనివాస్, ఎస్‌బీ ఏసీపీ డాక్టర్ జితేందర్‌రెడ్డి, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
వరంగల్ పోలీస్ కమిషనర్
సన్‌ప్రీత్ సింగ్
కమిషనరేట్‌లో నెలవారీ నేర సమీక్ష


