కీర్తి కిరీటం..టౌన్‌హాల్
హన్మకొండ అర్బన్: వరంగల్ నగరంలోకి అడుగుపెట్టగానే హనుమకొండ నడిబొడ్డున అత్యంత హుందాగా, రాజసం ఉట్టిపడేలా కనిపించే కట్టడం ‘టౌన్ హాల్’. మూడు ప్రధాన కూడళ్లను కలుపుతూ, నగర ప్రజలకు పచ్చదనం, స్వచ్ఛమైన గాలిని పంచుతున్న పబ్లిక్ గార్డెన్ (టౌన్ హాల్) నిర్మాణానికి శంకుస్థాపన చేసి సరిగ్గా వందేళ్లు పూర్తయ్యింది. 1924లో పునాది రాయి పడిన ఈ అపురూప కట్టడం, శతాబ్దాల చరిత్రను తనలో దాచుకుని నేటికీ ఠీవిగా నిలబడి ఉంది.
ఏడో నిజాం చేతుల మీదుగా ప్రారంభం..
వరంగల్ ప్రాంతం 1724లో నిజాం–ఉల్–ముల్క్ ఆధీనంలోకి వచ్చింది. అసఫ్ జాహీ వంశపాలన 200 సంవత్సరాలు (1724–1924) పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఆ విజయానికి గుర్తుగా ఈ భవనాన్ని నిర్మించారు. అప్పటి కలెక్టర్ మౌల్వీ సయ్యద్ మహమ్మద్ నయిమొద్దీన్ 1334 ఫసిలీ (క్రీ.శ. 1924)లో ఈ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. శిలాఫలకంపై 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ‘ఖాలెద్ ఉల్లాహ్, మాలిక–ఏ–సుల్తానేట్, షా–ఏ–డెక్కన్’ వంటి బిరుదులతో లిఖించారు. పదేళ్ల నిర్మాణ అనంతరం ఏడో నిజాం చేతుల మీదుగా దీనిని ప్రారంభించారు. దీని నిర్మాణాన్ని అప్పటి తాలూక్దార్ (కలెక్టర్) నాయూష్ యార్ జంగ్ బహదూర్ పర్యవేక్షించారు.
7 ఎకరాల సువిశాల స్థలంలో నిర్మాణం..
ఈ పబ్లిక్ గార్డెన్ అసలు పేరు ‘మహబూబ్ బాగ్’. 7వ నిజాం ఉస్మాన్‌అలీఖాన్ తన తండ్రి మీర్ మహబూబ్‌అలీఖాన్ జ్ఞాపకార్థం దీనిని నిర్మించారు. మొత్తం 23 ఎకరాల్లో ఉద్యానవనం ఏర్పాటుకు, టౌన్‌హాల్ నిర్మాణానికి అప్పట్లోనే రూ.2 లక్షలు నిజాం మంజూరు చేశారు. సుమారు 7 ఎకరాల సువిశాల స్థలంలో ఈ ‘బాగ్’ (తోట)ను తీర్చిదిద్దారు. అసఫ్ జాహీ నిర్మాణ శైలికి అద్దం పట్టేలా.. పాలరాతి కట్టడంలా మెరిసిపోయే ఈ భవనం రాత్రి వేళ ఫ్లడ్ లైట్ల వెలుగులో మరింత అందంగా కనిపిస్తుంది. విశాలమైన మెట్ల వరుసలు, మినార్లు, సుమారు 50 మంది సమావేశమయ్యే హాల్ దీని ప్రత్యేకత. ఇక్కడ ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఆవిష్కరించడం విశేషం.
ఒకప్పుడు చిన్న జూపార్కు..
గతంలో ఈ పబ్లిక్ గార్డెన్‌లో చిన్నపాటి జంతు ప్రదర్శనశాల (జూ పార్కు) ఉండేది. వరంగల్ మున్సిపల్ చైర్మన్‌గా ఉమ్మారెడ్డి ఉన్న సమయంలో జింకలు, దుప్పులు, తాబేళ్లు, కుందేళ్లు, పావురాలతో ఈ ప్రాంతం సందర్శకులకు కనువిందు చేసేది. ప్రస్తుతం అవన్నీ కనుమరుగయ్యాయి. కానీ, ఆ కాలంలో ఏర్పాటు చేసిన బాలల గ్రంథాలయం మాత్రం నేటికీ కొనసాగుతోంది.
సాంస్కృతిక వేదిక..
నేరెళ్ల వేణుమాధవ్ ఆడిటోరియం
రెండున్నర దశాబ్దాల క్రితం ఇక్కడ జాతీయ నాయకుడు గోవింద వల్లభ్‌పంత్ పేరిట ఆడిటోరియం నిర్మించాలని భావించారు. ఆయన కుమారుడు కేసీ పంత్ చేత శంకుస్థాపన చేయించారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత ప్రపంచ ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు, పద్మశ్రీ డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ పేరుమీద ఇక్కడ ఓపెన్ ఆడిటోరియం నిర్మించారు. ప్రస్తుతం నగరవాసులకు ఇది ప్రధాన సాంస్కృతిక వేదికగా సేవలందిస్తోంది.
చారిత్రక కట్టడానికి వందేళ్ల చరిత్ర
అసఫ్‌జాహీల
200 ఏళ్ల పాలనకు చిహ్నం
నాడు‘మహబూబ్ బాగ్’..
నేడు ’పబ్లిక్ గార్డెన్’
1924లో శంకుస్థాపన..
1943లో ప్రారంభోత్సవం
వరంగల్ వైభవానికి సాక్ష్యంగా నిలుస్తున్న కట్టడం
‘తోడ్–ఫోడ్’
ఇస్మాయిల్ ఖాన్ కథ
ఈ గార్డెన్ కు సంబంధించి ఒక ఆసక్తికరమైన కథనం ప్రచారంలో ఉంది. నిజాం ప్రభుత్వ అధికారి మీర్జా ఇస్మాయిల్ వరంగల్‌లో పర్యటించినప్పుడు, ఈ ‘బాగ్–ఏ–ఆమ్’ చుట్టూ ఉన్న భారీ ప్రహరీని చూసి ఆశ్చర్యపోయారు. ప్రజల కోసం కట్టిన పార్కు వారికి కనిపించకుండా ఇంత ఎత్తు గోడలు ఎందుకని ప్రశ్నించి వెంటనే ఆ గోడలను కూల్చివేయమని ఆదేశించారు. అప్పటి నుంచి ఆయనకు ‘తోడ్–ఫోడ్’ (పడగొట్టే) ఇస్మాయిల్ అనే పేరు వచ్చిందని చెబుతారు.


