పోలీస్ బాస్ సీరియస్.. ఇద్దరు ఊస్ట్
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లోని మామునూరు పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తించిన ఇన్‌స్పెక్టర్ ఒంటేరు రమేశ్, గన్‌మెన్ పి.రఘుపై అవి నీతి ఆరోపణాలు నిరూపణ కావడంతో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ సస్పెన్షన్ వేటు వేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొంత కాలంగా మామునూరు పోలీస్ స్టేషన్‌లో గతంలో పనిచేసిన ఇన్‌స్పెక్టర్ ఒంటేరు రమేశ్, సబ్ ఇన్‌స్పెక్టర్, గన్‌మెన్‌పై తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు వచ్చాయి. అయితే వీరిని కాపాడేందుకు ప్రజాప్రతినిధులు ప్రయత్నాలు చేశారు. ఈ విషయంపై ఈనెల 24న ‘సాక్షి’లో ‘ఖాకీ పోస్టింగ్‌లపై ఖద్దర్ ముద్ర’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఈ కథనంలో ప్రధానంగా పోలీస్ ఉన్నత అధికారులు.. అవినీతికి పాల్పడిన కొందరు అధికారులపై విచారణలో నిరూపితమైనా చర్యలు తీసుకోవడం లేదనే విషయాన్ని స్పష్టంగా ప్రచురించింది. అవినీతి ఆరోపణాలు ఎదుర్కొన్న ఇన్‌స్పెక్టర్ రమేశ్, గన్‌మెన్ రఘుపై డీసీపీ సమర్పించిన నివేదిక ఆధారంగా కమిషనరేట్ పోలీస్ బాస్ సస్పెన్షన్ వేటు వేసి ఒత్తిళ్లకు లొంగే ప్రసక్తే లేదని నిరూపించారు. దీంతో ఒక్కసారిగా కమిషనరేట్‌లోని కొంత మంది అవినీతి అధికారుల్లో ఎప్పుడు వేటు పడుతుందోననే గుబులు మొదలైంది. అవినీతి అధికారులను కాపాడేందుకు అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే తీవ్ర ప్రయత్నాలు చేసినా ఆయన ఒత్తిళ్లు ఫలించలేదు. వర్ధన్నపేట సబ్‌డివిజన్‌లో ఓ ఇన్‌స్పెక్టర్ ఓ హత్యకేసులో పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని కేసును అటకెక్కించినట్లు ప్రచారం సాగుతోంది. సదరు ఇన్‌స్పెక్టర్‌పై కూడా చర్యలు ఉండనున్నట్లు సమాచారం.
ఇన్‌స్పెక్టర్ రమేశ్, గన్‌మెన్ రఘు సస్పెన్షన్
అవినీతి నిరూపణ కావడంతో ఇద్దరిపై వేటు
పనిచేయని రాజకీయ ఒత్తిళ్లు..
పోలీస్ బాస్ సీరియస్.. ఇద్దరు ఊస్ట్


