మరణంలోనూ వీడని స్నేహబంధం
ఐనవోలు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు ప్రాణాలు కోల్పోయిన ఘటన హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం వెంకటాపురం శివారులో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒంటిమామిడిపల్లి గ్రామానికి చెందిన ఎండీ చిన్న యాకూబ్ (65), ఉడుతగూడెం గ్రామానికి చెందిన ఆకారపు వెంకట్‌రెడ్డి(69) 30 సంవత్సరాలుగా స్నేహితులు. వీరు సొంత పనుల నిమిత్తం ఎక్సెల్ వాహనంపై సాయంత్రం రాంపూర్ గ్రామానికి వెళ్లారు. రాత్రి స్వగ్రామాలకు వస్తుండగా వెంకటాపురం గ్రామ శివారుకు చేరుకోగా ఎదురుగా వస్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆకారపు వెంకట్‌రెడ్డి అక్కడికక్కడే మృతిచెందగా, చిన్న యాకూబ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో మృతిచెందాడు. యాకూబ్‌కు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. వెంకట్‌రెడ్డికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇద్దరు స్నేహితుల మృతితో ఒంటిమామిడిపల్లి, ఉడుతగూడెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రైతులు రోడ్డుపై ధాన్యం ఆరబోయడంతో ఒకే వైపు నుంచి వాహనదారులు రాకపోకలు చేస్తున్నారని, ఆ క్రమంలో ప్రమాదం జరిగి ఉంటుందని వెంకటాపురం గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డుపై ధాన్యం ఆరబోయకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
ఎక్సెల్‌ను ఢీకొన్ని గుర్తు తెలియని వాహనం
వెంకటాపురం శివారులో ఘటన
ఒంటిమామిడిపల్లి, ఉడుతగూడెంలో విషాదం
మరణంలోనూ వీడని స్నేహబంధం


