కలెక్టరేట్లలో మీడియా సెంటర్లు ప్రారంభం
హన్మకొండ అర్బన్: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో హనుమకొండ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌ను జిల్లా ఎన్నికల అఽధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సెంటర్‌లో సాంకేతిక, సమాచార ఏర్పాటును అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని మీడియా సెంటర్ ద్వారా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు ఎప్పటికప్పుడు అందించాలని సూచించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సోషల్ మీడియా పోస్టులను పర్యవేక్షించి, ప్రవర్తన నియమావళి ఉల్లంఘన జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, ట్రైనీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత, డీఆర్డీఓ మేన శ్రీను, ఇన్‌చార్జ్ డీపీఆర్‌ఓ అయూబ్ అలీ, తదితరులు పాల్గొన్నారు.
వరంగల్‌లో మీడియా సెంటర్ ప్రారంభం
వరంగల్: గ్రామ పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకుని వరంగల్ కలెక్టరేట్ ప్రాంగణంలోని డీపీఆర్‌ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్(ఎంసీఎంసీ)ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద గురువారం ప్రారంభించారు. మీడియా కోసం అందుబాటులో ఉన్న సదుపాయాలు, ఎంసీఎంసీ విధుల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా సెంటర్ ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అందించాలని సూచించారు. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి మీడియా సహకారం అందించాలని కలెక్టర్ కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, డీపీఓ కల్పన, డీపీఆర్‌ఓ అయూబ్ అలీ, అదనపు పీఆర్‌ఓ ప్రేమలత తదితరులు పాల్గొన్నారు.
టీఈ పోల్ యాప్‌ను వినియోగించుకోవాలి
వరంగల్: ఓటర్లకు గ్రామ పంచాయతీ ఎన్నికల సమాచారాన్ని అందించేందుకు రూపొందించిన టీఈ – పోల్ మొబైల్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఒక ప్రకటనలో తెలిపారు. ఈ యాప్‌లో పోలింగ్ కేంద్రం వివరాలు, ఓటర్ స్లిప్పుల నమోదు సమాచారం సులభంగా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ యాప్‌ను విస్తృతంగా ప్రచారం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
కలెక్టరేట్లలో మీడియా సెంటర్లు ప్రారంభం


