అర్ధరాత్రి మేయర్ ఆకస్మిక తనిఖీలు
పారిశుద్ధ్య నిర్వహణపై ఆరా
వరంగల్ అర్బన్: మహా నగర వ్యాప్తంగా ప్రధాన రహదారుల్లో పారిశుద్ధ్య నిర్వహణపై మేయర్ గుండు సుధారాణి బుధవారం అర్ధరాత్రి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. స్వీపింగ్ యంత్రాల పనితీరుపై హన్మకొండ చౌరస్తా, పోచమ్మ మైదాన్ కూడలి ప్రాంతాల్లో మేయర్ క్షేత్రస్థాయిలో సందర్శించారు. గురువారం బల్దియా కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ.. నగర పరిధి 66 డివిజన్లలో జేసీబీల, సక్కింగ్ మిషన్లను వినియోగించుకోవాలని ప్రజారోగ్య అధికారులకు సిబ్బందికి సూచించారు.
ఫైనల్ రిపోర్టును నివేదించండి
మహానగర వ్యాప్తంగా అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ సిస్టమ్‌పై ఫైనల్ రిపోర్టు అందజేయాలని మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. గురువారం బల్దియా ప్రధాన కార్యాలయంలో ఎస్‌డబ్ల్యూఏం, యూజీడీ స్ట్రాం వాటర్ డ్రెయిన్ అంశాలపై సాంకేతికతపై సీడీఎంఏ, ఈఎన్‌సీ, సౌత్ ఆసియా ప్రతినిధులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. కమిషనర్ చాహత్ తో కలిసి చర్చించారు.
సర్వసభ్య సమావేశానికి సిద్ధం కావాలి..
డిసెంబరు 1న జరిగే సర్వసభ్య సమావేశానికి అన్ని విభాగాల అధికారులు సన్నద్ధం కావాలని మేయర్ గుండు సుధారాణి సూచించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ. ప్రతీ విభాగం తమ పరిధిలోని అభివృద్ధి పనులు, కొనసాగుతున్న ప్రాజెక్టుల స్థితిగతులు, పెండింగ్‌లో ఉన్న అంశాలు వంటి వివరాలను సమగ్ర నివేదికల రూపంలో సిద్ధం చేసుకోవాలన్నారు.


