15లోగా పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే సమ్మె
బల్దియా కమిషనర్‌కు కాంట్రాకర్ల
అసోసియేషన్ నాయకుల వినతి
వరంగల్ అర్బన్ : వివిధ అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లులను ఈనెల 15వ తేదీలోగా చెల్లించాలని, లేనిపక్షంలో నిరవధిక సమ్మెకు దిగుతామని గ్రేటర్ వరంగల్, హనుమకొండ కాంట్రాక్టర్స్ అసోసియేషన్స్ నాయకులు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం హనుమకొండ ‘కుడా’ కార్యాలయంలో యూనియన్ల నా యకులు కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. 400మంది కాంట్రాక్టర్లు ఉన్నారని, గత 8 నెలలుగా బిల్లులు చెల్లింపులు నిలిపివేశారని పేర్కొన్నారు. అప్పులు చేసి మెటీరియల్, లేబర్‌ను పెట్టుకొని పనులు పూర్తి చేసినా బిల్లులు ఇవ్వకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నట్లు పేర్కొన్నారు. జనరల్ గ్రాంట్స్, క్యూసీ, ఆర్‌ఎండీ, ఈఎండీ బిల్లులు ఇవ్వాలన్నారు. ఎస్‌ఎస్‌ఆర్ రేట్లను వేరే డిపార్ట్‌మెంట్ తరహాలో సవరించాలని కోరారు. వినతిపత్రం అందించిన వారిలో కొత్తగట్టు సుధాకర్, పూజారి శ్రీనివాస్, ఆదిల్, మేకల రమేశ్, మిట్టపల్లి రాజేందర్, చిదురాల మధుసూదన్, బాల సుధాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.


